iDreamPost

నిజంగా చంద్రబాబు రాజధాని అంశం మీద రెఫరెండమ్ కావాలని అనుకుంటే…

నిజంగా చంద్రబాబు రాజధాని అంశం మీద రెఫరెండమ్ కావాలని అనుకుంటే…

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని, దేశంలోనే అత్యంత సీనియర్ అని తనని తాను అభివర్ణించుకునే ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని సార్లు ఎదుటివారి తెలివితేటలు చాలా తక్కువగా అంచనా వేస్తారు. తనని తాను మహా మేధావిగా అనుకోవడం వల్ల వచ్చిన లక్షణమో, లేక వయసు వల్ల వచ్చిన చాదస్తమో తెలియదు కానీ ఈ మధ్య ఈ లక్షణం వారిలో బాగా ముదిరిపోయింది.
అన్ని స్థానాలకు రాజీనామా చేసి, రాజధాని వికేంద్రీకరణ అన్న అంశం మీద ఎన్నికల్లో పోటీ చేద్దాం, మీరు 151 స్థానాలు తిరిగి గెలుచుకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అని చంద్రబాబు జగన్ ని ఛాలెంజ్ చేయడం దీనికి తాజా ఉదాహరణ.
రెండు పక్షాల బలాబలాలు చూస్తేనే ఇది ఎంత హాస్యాస్పదమైన ప్రతిపాదనో అర్థం అవుతుంది. అధికార పక్షం బలం 151 అయితే చంద్రబాబు బలం 23.అందులో ఇద్దరు ఆల్రెడీ తిరుగుబాటు జెండా ఎగురవేసి ఉన్నారు. ఈ లెక్కన చంద్రబాబుకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలకు పోటీగా తన 151 మంది ఎమ్మెల్యేలను ఒడ్డి రెఫరెండమ్ నిర్వహించాలి అధికార పక్షం. అందులో గెలిచి, అధికారం చేపట్టి సంవత్సరం కూడా గడవకముందే!!
నిజంగా రాష్ట్ర ప్రజలు రాజధాని వికేంద్రీకరణ మీద వ్యతిరేకంగా ఉన్నారని చంద్రబాబుకు అంత గట్టి నమ్మకం ఉంటే అధికార పక్షంతో సంబంధం లేకుండా రెఫరెండమ్ కోరవచ్చు.
ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగురవేసి, తనను అడ్డమైన బూతులు తిట్టిన వల్లభనేని వంశీని, అధికార పక్షం వైపు జరుగుతున్న మరో ఎమ్మెల్యే మద్దాలి గిరిని వదిలేసి, తన బావమరిది కమ్ వియ్యంకుడూ అయిన బాలకృష్ణతో సహా మిగిలిన 21 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేటప్పుడు రాజధాని సంబంధించి మూడు విభాగాలు, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఒకే చోట ఉండాలంటే మా పార్టీకి ఓటేయండి, మూడు చోట్ల ఉండాలంటే మా ప్రత్యర్థులకు ఓటేయండి అన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో ప్రజల ముందుకు పోయి, 21 స్థానాలూ బంపర్ మెజారిటీతో గెలిస్తే, తన వాదనకు ప్రజల్లో బలమైన మద్దతు ఉందని దేశమంతా చాటిచెప్పినట్టు అవుతుంది.
అప్పుడు రాజధాని వికేంద్రీకరణ అన్న జగన్ ప్రతిపాదనకు ప్రజల మద్దతు లేదని నిరూపించవచ్చు. ఆమాత్రానికే ప్రభుత్వం రాజీనామా చేయకపోయినా జగన్ ప్రభుత్వాన్ని బలమైన దెబ్బ కొట్టినట్టు అవుతుంది.
రెఫరెండమ్ అని పదేపదే గొంతెమ్మ కోరికలు కోరుతున్న చంద్రబాబు నాయుడు ఈ విధంగా అధికార పక్షంతో సంబంధం లేకుండా వారి మీద ఈ విధంగా రెఫరెండమ్ ని బలవంతంగా రుద్దొచ్చు!!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి