iDreamPost

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు కాబోతున్నాయా..? అనుమానాలకు తావిస్తున్న నిమ్మగడ్డ ప్రకటన..!

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు కాబోతున్నాయా..? అనుమానాలకు తావిస్తున్న నిమ్మగడ్డ ప్రకటన..!

గత ఏడాది మార్చిలో వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు కాబోతున్నాయా..? మళ్లీ కొత్తగా నోటిఫికేషన్‌ జారీ కాబోతోందా..? అనే అనుమానాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చేసిన ప్రకటన, తీసుకున్న నిర్ణయం బలపరుస్తున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నామినేషన్లు ఉపసంహరణ వరకు కొనసాగాయి. ఆ తర్వాత కరోనాను కారణంగా చూపుతూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వాయిదా వేశారు. దాదాపు 20 శాతానికి పైగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో అవి ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అభ్యర్థులకు డిక్లరేషన్‌ కూడా ఇచ్చారు. ఏకగ్రీవాలు జరగడంపై ప్రతిపక్షాలు అధికారపార్టీ పై విమర్శలు చేశాయి. బెదిరించి, భయపెట్టి తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయలేదని, వేసిన వారిని ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేశారంటూ ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేసింది. ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదులు చేసింది.

నాడు ఏకగ్రీవాలపై ప్రతిపక్ష పార్టీ చేసిన విమర్శలు, ఫిర్యాదులను పట్టించుకోని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. తాజాగా తిరుపతిలో మాట్లాడుతూ.. గత ఏడాది జరిగిన ఏకగ్రీవాలను పక్కనపెడుతున్నట్లు చెప్పారు. ఏకగ్రీవాలు జరిగిన మండలాల్లోని అధికారులను బదిలీ చేస్తున్నట్లు విజయవాడలో ప్రకటించారు. ఈ రెండు చర్యల కారణంగానే పైన పేర్కొన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలవంతపు ఏకగ్రీవాలు చట్ట రీత్యా నేరం. ఒక వేల ఇలా జరిగితే అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయాలి. వారు కమిషన్‌ దృష్టికి తీసుకురావాలి. ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత అవి నిజమని నిర్థారణ అయితే.. రద్దు చేయడమో లేదా ఫిర్యాదును తిరస్కరించడమో కమిషన్‌ చేయాలి. కానీ గత ఏడాది జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన స్థానాల్లో అభ్యర్థులెవరూ రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయలేదు. రిటర్నింగ్‌ అధికారులు ఆయా స్థానాలు ఏకగ్రీవమైనట్లు అభ్యర్థులకు డిక్లరేషన్‌ కూడా ఇచ్చారు.

అలాంటిది ఇప్పుడు ఎన్నికల కమిషనర్‌ ఆ ఏకగ్రీవాలను పక్కనపెడుతున్నానంటూ ప్రకటించడం వెనుక లక్ష్యం ఏమిటి..? ఒకసారి డిక్లరేషన్‌ ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకునే అవకాశం లేదు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే పోటీదారుడు కోర్టుకు వెళ్లవచ్చు. ఇక్కడ డిక్లరేషన్‌ ఇచ్చిన తర్వాత ఏకగ్రీవాలను పక్కనపెట్టే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేదు. అయినా నిమ్మగడ్డ ఇలాంటి ప్రకటన చేయడంతో.. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను పరిగణలోకి తీసుకుని, వారు డిమాండ్‌ చేస్తున్నట్లు ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్‌ జారీకి రంగం సిద్ధం చేయబోతున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎక్కడ ఆగాయో, తిరిగి అక్కడ నుంచే ప్రారంభమవుతాయని ఇటీవల నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పలు సందర్భాల్లో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ జారీ చేసిన సమయంలోనూ ఇదే విషయం చెప్పారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచి మొదలవుతుందని చెప్పారు. ఇలా చెప్పిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఇప్పుడు ఏకగ్రీవాలను పక్కనపెడుతున్నట్లు ప్రకటించడం వెనుకు ఉద్దేశం ఏమిటి..? పక్కనపెడుతున్నానంటే దాని అర్థం ఏమిటి..? పక్కన పెట్టిన చోట మాత్రమే తిరిగి ఎన్నికల ప్రక్రియను మొదట నుంచి ప్రారంభిస్తారా..? లేక మొత్తం రద్దు చేస్తారా..? అది చట్ట ప్రకారం సాధ్యమేనా..? ఎన్నికైనట్లు డిక్లరేషన్‌ కూడా పొందిన అభ్యర్థుల పరిస్థితి ఏమిటి..? వారు కోర్టులకు వెళితే.. ఆ వివాదాలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి..? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ అంశాలపై స్పష్టత రానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి