iDreamPost

టీడీపీ పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ ఎందుకు..?

టీడీపీ పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ ఎందుకు..?

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ఆగిన చోట నుంచే మళ్లీ త్వరలోనే మొదలవుతాయనే ప్రచారం జరుగుతున్న వేళ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి సంచలన నిర్ణయం తీసుకుంది. పరిషత్‌ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అరాచకాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ పేర్కొంటోంది. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌ ఉన్నప్పుడే రెచ్చిపోయిన వైసీపీ.. ఇప్పుడు ఆయన లేకుండా పరిషత్‌ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరవనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొస్తోంది.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పదవీ కాలం నిన్నటితో ముగిసింది. ఈ రోజు నూతన ఎస్‌ఈసీగా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు చేపట్టారు. మధ్యలో ఆగిపోయిన పరిషత్‌ ఎన్నికల నిర్వహణపై కసరత్తులు మొదలుపెట్టారు. ప్రభుత్వం కూడా ఆరు రోజుల్లో ముగిసే పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ తర్వాత.. కోవిడ్‌ వ్యాక్సిన్‌పై దృష్టి పెట్టాలని భావిస్తోంది. ఏ క్షణానైనా పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావచ్చు. ఇలాంటి సమయంలో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటన చేసింది.

ఈ ప్రకటన చేయక ముందు ఆ పార్టీ నేత, పోలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎస్‌ఈసీ నీలం సాహ్నిని కలిశారు. పరిషత్‌ ఎన్నికలను మళ్లీ మొదటి నుంచి నిర్వహించేలా నోటిఫికేషన్‌ జారీ చేయాలని వినతిపత్రం అందించారు. ఇది జరిగిన తర్వాత ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ నిర్ణయం తీసుకోవడం విశేషం.

Also Read : పరిషత్‌ ఎన్నికలకు సాయంత్రం నోటిఫికేషన్‌..?

గత నెలలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. గ్రామాల్లో ఓటర్ల నాడి ఎలా ఉందో పంచాయతీ ఎన్నికల ద్వారా, పట్టణాల్లో మున్సిపల్‌ ఎన్నికలతో తేలిపోయింది. పార్టీ గుర్తులపై జరగని పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు తమకు వ్యతిరేకంగా వచ్చినా.. టీడీపీ నేతలు ఏవో గణాంకాలు చెప్పి వైసీపీకి గట్టిపోటీ ఇచ్చామని చెప్పుకున్నారు. అయితే పార్టీ గుర్తులపై జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ అవకాశం టీడీపీ నేతలకు లేకుండా పోయింది. 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కేవలం తాడిపత్రి మున్సిపాలిటీలోనే టీడీపీ గెలిచింది. మిగతా అన్ని చోట్లా ఘోర ఓటమిని మూటకట్టుకుంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగుతాయి. ఈ ఎన్నికల్లో కూడా ఎలాంటి ఫలితాలు వస్తాయో టీడీపీ నేతలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. గ్రామాల్లోనూ టీడీపీ ఘోరంగా ఓడిపోయిందనే అపవాదు నుంచి తప్పించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఎన్నికల సంగ్రామంలోకి దిగకముందే.. టీడీపీ చేతులు ఎత్తేయడం విశేషం. టీడీపీ చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే ప్రథమం కావడం ఆ పార్టీ దుస్థితికి అద్ధం పడుతోంది.

ఎన్నికల బహిష్కరణకు టీడీపీ చూపిన కారణం హాస్యాస్పదంగా ఉంది. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌ ఉన్నప్పుడు వైసీపీ రెచ్చిపోయిదంటూ చెప్పుకొచ్చింది. ప్రభుత్వం ఎడ్డమంటే తెడ్డమనేలా.. మంత్రులతో వివాదాలు, ఏకగ్రీవాలపై తనికీలు, వలంటీర్లపై ఆంక్షలు కోర్టుల్లో కేసులతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎలా పని చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే.

ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని, రీ పోలింగ్‌ లేకుండా పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు జరగడం చాలా ఆనందంగా ఉందని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆయా ఎన్నికలు ముగిసిన తర్వాత, తన పదవీ విరమణ సమయంలోనూ చెప్పారు. నిమ్మగడ్డపై ఎంతో నమ్మకంతో మాట్లాడుతున్న టీడీపీ నేతలకు.. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన తీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు పట్టించుకోకుండా.. ఆయన లేకపోతే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవని చెప్పడం విడ్డూరంగా ఉంది.

Also Read : అయ్యో బాబూ.. దీదీకి అక్కరకు రాకుండా పోయావే!

నిమ్మగడ్డ ఉన్నప్పుడే పరిషత్‌ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్న టీడీపీ.. అందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ మార్చి 11వ తేదీన ముగిసినా.. పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ ఆసక్తి చూపలేదు. పదవీ విరమణకు ఇంకా 20 రోజులు ఉన్నా.. పట్టించుకోలేదు. ఆరు రోజుల్లో ముగిసే పరిషత్‌ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం కోరినా పెడచెవిన పెట్టారు. పదవీ విరమణకు ఆరు రోజుల ముందు తనకు సమయం లేదని చెప్పుకొచ్చారు. అంతకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ పదే పదే డిమాండ్‌ చేస్తూ.. వైసీపీ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా ప్రకటనలు చేసిన టీడీపీ నేతలు.. పరిషత్‌ ఎన్నికల నిర్వహించాలంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు కనీసం వినతి పత్రం కూడా ఇవ్వకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం.

అసలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటన చేయడమే ఓ విడ్డూరం. నామినేషన్లు దాఖలు, పరిశీలన, ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన వరకూ ప్రక్రియ పూర్తయింది. ఇక ప్రచారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పోలింగ్, కౌంటింగ్‌ ఉంటుంది. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించినా.. పోలింగ్‌ అయితే జరుగుతుంది. ప్రజలు తమకు నచ్చిన పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయడం తధ్యం. కౌటింగ్‌ నిర్వహించడం, ఫలితాలు ప్రకటించడం సర్వసాధారణంగా జరిగేదే. మరి ఇలాంటి పరిస్థితిలో టీడీపీ తీసుకున్న నిర్ణయం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది.

అయితే రేపు ఫలితాలు ఎలా వచ్చినా.. మేము బహిష్కరించాం కాబట్టి.. మా కేడర్‌ ఎన్నికలకు దూరంగా ఉంది.. అందుకే అలాంటి ఫలితాలు వచ్చాయని టీడీపీ చెప్పుకునే అవకాశం ఉంది.

Also Read : జగన్‌కు అంత క్రేజ్‌..! అందుకేనా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి