iDreamPost

ఆ 17 మంది ఎమ్మెల్యే లు ఏమయ్యారు ??

ఆ 17 మంది ఎమ్మెల్యే లు ఏమయ్యారు ??

ఈరోజు ఉదయం శాసనమండలిని రద్దు చేయాలని తీర్మానించిన రాష్ట్ర క్యాబినెట్, తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టగా దానిపై ఉదయం నుండి అసెంబ్లీ లో చర్చ జరిగింది. ముందే ప్రకటించిన విధంగా, శాసనమండలి రద్దుకు తాము వ్యతిరేకమని, అందుకే ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న చర్చకు, ఓటింగు కు దూరంగా ఉండాలని నిర్ణయించిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సభకు గైరుహాజరైనప్పటికీ, బిల్లుపై ఉదయం నుండి పలువురు అధికార పార్టీ సభ్యులతో పాటు, జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక కూడా ఈ బిల్లు ని సమర్ధిస్తూ ప్రసంగించారు.

శాసన మండలిని రద్దు చెయ్యడానికి గల కారణాలను సభకు వివరిస్తూ చివరిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించిన అనంతరం, స్పీకర్ బిల్లుపై ఓటింగ్ కి అనుమతిస్తూ శాసనమండలి రద్దు చేసే తీర్మానానికి అనుకూలంగా ఉన్న సభ్యులందరు లేచి నిలబడి ఈ తీర్మానానికి మద్దతు తెలపాల్సిందిగా కోరడంతో సభలో నిల్చొన్న సభ్యులందరినీ అసెంబ్లీ సిబ్బంది దాదాపు పావు గంట సేపు లెక్కబెట్టి స్పీకర్ కి ఆ వివరాలు అందించారు. అనంతరం స్పీకర్ అధికారికంగా తీర్మానానికి అనుకూలంగా 133 మంది ఓటు వేశారని, తీర్మానానికి తటస్థంగా కానీ వ్యతిరేకంగా కానీ ఎవరూ లేరని ప్రకటించి శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించినట్టు అధికారికంగా ప్రకటించారు.

శాసనమండలి బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యంగంలో ఆర్థికల్ 169 ప్రకారం సభకు హాజరైన సభ్యుల్లో తప్పనిసరిగా మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. దానితో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అసెంబ్లీ సభ్యుల సంఖ్య ఆధారంగా కనీసం 118 మంది సభ్యులు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వెయ్యాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు సభకు తెలుగుదేశం సభ్యులు గైర్హాజరవ్వడంతో ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్న 23 మంది సభ్యుల్లో 21 మంది గైరుహాజరయ్యారు. ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమని స్వతంత్రంగా ప్రకటించమని కోరుతూ స్పీకర్ అనుమతితో వారికి కేటాయించిన ప్రత్యేక స్థానాల్లో కూర్చుంటున్నారు. మాములుగా పార్టీ విప్ ధిక్కరిస్తే తప్ప వీరు అనర్హతకు గురి అయ్యే అవకాశం లేదు. ఇక జనసేన కి సభలో ఒకే ఒక సభ్యుడు ఉన్నారు.

అయితే ఈరోజు జరిగిన ఓటింగ్ లో సవతంత్రంగా వ్యవహరిస్తున్న ఇద్దరు తెలుగుదేశం సభ్యులు వల్లభనేని వంశి, మద్దాళి గిరిధర్ తో పాటు ఏకైక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఓటింగ్ లో పాల్గొనలేదని తెలుస్తుంది. అంటే మొత్తంగా విపక్ష సభ్యులందరూ అధికారికంగా ఓటింగ్ కి దూరంగా వున్నారు. ఇదే సమయంలో సభలో మొత్తం వైసిపి సభ్యుల బలం 151 మంది కాగా వీరిలో స్పీకర్ తమ్మినేని సీతారాంని మినహాయిస్తే మిగిలిన 150 మంది సభ్యుల్లో కేవలం 133 మంది మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. మిగతా 17 మంది సభ్యులు ఓటింగ్ లో పాలు పంచుకోలేదు.

అధికారికంగా విప్ జారీ చెయ్యకపోయినప్పటికీ అధికారపక్షానికి చెందిన 17 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో, ఆ 17 మంది ఎవరిని ?? వారు ఎందుకు ఓటింగ్ లో పాల్గొనలేదని ?? ఇప్పుడు సభలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఓటింగ్ కి గైరుహాజరైన సభ్యుల వివరాలు ఇంకా బయటకి తెలియకపోయినప్పటికీ.. సరిగ్గా ఓటింగ్ పై సభలో అలారం మోగి తలుపులు మూసివేసే సమయానికి కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీల్లో ఉండిపోయినట్టు తెలుస్తుంది. కొంతమంది సభ్యులు మాత్రం ఆరోగ్యసమస్యలతో పాటు వ్యక్తిగత కారణాలతో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనల్లో ఉన్నందువల్ల ముందస్తు అనుమతితోనే సభకు గైరుహాజరైనట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు అందరి దృష్టి అసెంబ్లీపైనే ఉన్నతరుణంలో అనుమతి లేకుండా ఓటింగ్ కు దూరంగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి జగన్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి