iDreamPost

Bigg Boss 6 Telugu బిగ్ బాస్ 6 తేడా కొట్టేస్తోంది

Bigg Boss 6 Telugu బిగ్ బాస్ 6 తేడా కొట్టేస్తోంది

టీవీ రియాలిటీ షోలలో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన బిగ్ బాస్ మొదటి రెండు మూడు సీజన్లతో పోల్చుకుంటే ఇప్పుడు జరుగుతున్న ఆరో సిరీస్ నీరసంగా సాగుతోంది. నాగార్జునకు బాక్సాఫీస్ వద్ద ది ఘోస్ట్ షాక్ ఇవ్వగా ఇప్పుడీ గేమ్ కు వస్తున్న స్పందన నిరాశ కలిగించేదే. మొదలుపెట్టి నెల రోజులు దాటినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా పార్టిసిపెంట్స్ విషయంలో నిర్వాహకులు తీసుకున్న నిర్ణయాలు రీచ్ ని బాగా దెబ్బ తీశాయి. సోషల్ మీడియాలోనూ ఏ హడావిడి కనిపించడం లేదు. ఇప్పుడున్న సభ్యుల పిఆర్ టీములు బలహీనంగా ఉండటం కూడా దీనికి కారణమే. గత సీజన్ల విన్నర్లలో వీళ్ళ పాత్ర చాలా కీలకం.

మరోవైపు జనంలోనూ ఈ షో పట్ల ఆసక్తి బాగా సన్నగిల్లిపోయింది. పదే పదే టాస్కుల పేరుతో ఒకే ఫార్మాట్ లో సాగడం బోర్ కొట్టిస్తోంది. ఎలాంటి కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్. పోనీ పాల్గొన్న వాళ్ళు సెలబ్రిటీలైతే ఏదో రకంగా టైం పాస్ చేసుకోవచ్చు. గుర్తింపు ఉన్న చలాకి చంటి లాంటి ఆర్టిస్టులు కూడా త్వరగా బయటికి రావడం షో ఫ్లోని దెబ్బ తీస్తోంది. ఇదంతా ప్లాన్డ్ గా ముందు చేసుకున్న అగ్రిమెంట్ల ప్రకారమే ఎలిమినేషన్లు జరుగుతాయనే వాదన ఉంది కానీ ఓట్లకు సంబంధించి ఏది నిజం ఏది అబద్దం అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి సదరు ఛానెల్ చెప్పిందే నిజమనుకుని సర్దుకోవడం తప్ప ఏం చేయలేని పరిస్థితి.

వీకెండ్ లో వచ్చే నాగార్జున సైతం స్క్రిప్ట్ రైటర్ ఇచ్చిన నోట్స్ ప్రకారం ఈ తతంగం జరిపిస్తున్నారు కానీ అదే పనిగా రోజు ఎపిసోడ్లు చూస్తున్నారన్న నమ్మకం లేదు. ఏది ఎలా ఉన్నా బిగ్ బాస్ 6ని అర్జెంట్ గా వీలైనంత రిపేర్లు చేయడం అవసరం. ఇలాగే ఉంటే ఇంకో రెండు నెలలు నెట్టుకురావడం కష్టం, మరోవైపు గతంలో ప్రతి ఎపిసోడ్ కు డిటైల్డ్ కవరేజ్ ఇచ్చిన మీడియా ఈసారి దాన్ని లైట్ తీసుకుంది. అప్పుడప్పుడు టచ్ చేయడం తప్ప రివ్యూలసలే లేవు. ఇదంతా నాగ్ చేతిలో లేదు. షో మేకర్స్ ఎక్కడ ఏది మిస్ అవుతుందో గుర్తించి వీలైనంత త్వరగా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అప్పుడే డిజాస్టర్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి