iDreamPost

ఎవరా 500 ఎకరాల బినామీ భూముల హీరో?

ఎవరా 500 ఎకరాల బినామీ భూముల  హీరో?

ఈ రోజు ఆంధ్రజ్యోతి అమరావతి ఆందోళనల గురించి వార్తలు రాసే క్రమంలో బినామీల పేర్లతో పలువురు పారిశ్రామిక వేత్తలు , సినీ స్టార్స్ కోట్లు వెచ్చించి రాజధాని అమరావతిలో భూములు కొన్నారని వెల్లడించింది . ప్రత్యేకించి ఒక స్టార్ హీరో 500 ఎకరాలు కొన్నాడని అతను ఇప్పుడు లబోదిబోమంటున్నాడని బయట పెట్టి సంచలనం సృష్టించింది .

ఎవరా సినీ హీరో అంత స్థాయి ఎవరికి ఉంది ఆలోచిస్తే ఏడెనిమిదిమంది దాకా ఉంటారు కానీ పూర్తిగా టీడీపీ నేతల కనుసన్నల్లో లావాదేవీలు జరిగే అమరావతిలో వేలు పెట్టే అవకాశం మాత్రం అదీ వందల ఎకరాల స్థాయిలో కొనే అవకాశం మాత్రం నలుగురికి మించి లేదని చెప్పొచ్చు .

అందులో ఎక్కువ అవకాశం ఉన్నది మాత్రం 2014 లో పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా అన్ కండిషనల్ గా టీడీపీకి సపోర్ట్ చేసిన హీరోకి ఉందన్నది పలువురి అభిప్రాయం . అందుకు ఫలితంగా కొంత భూమిని తరువాత దశల వారీగా టీడీపీని సపోర్ట్ చేస్తూ ప్రతిపక్షాన్ని విమర్శించటానికి ఉపయోగపడ్డప్పుడల్లా కొంత కొంత ప్రతిఫలంగా భూమి రూపంలో పొందాడని , అనంతరం ఈ భూ లావాదేవీల్లో గొడవల కారణంగానే టీడీపీకి దూరమై 2019 లో ఒంటరిగా పోటీ చేశాడని ఊహాగానాలు చెలరేగుతున్నాయి .

ప్రస్తుతం అమరావతిలో రాజధాని సందిగ్ధంలో పడ్డ పరిస్థితుల్లో ఈ వివాదానికి దూరంగా విదేశీ పర్యటనకు పోయిన సదరు కధా నాయకుణ్ణి కూడా రాజధాని పోరులో భాగస్వామిని చేసేందుకే బాబు గారు ఈ విధంగా తన ఆస్థాన పత్రికలో లీకులు ఇచ్చారని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు .

అతన్ని పక్కన పెడితే ఆ స్థాయిలో భూములు పోగు చేయగల సత్తా ఉన్న హీరో మరొకరు టీడీపీలోనే ప్రభావశీల నాయకుడు , టీడీపీ స్టార్ కాంపైనర్ , ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే , బాబు గారి బంధువుని చెప్పుకోవచ్చు . అయితే అతనికి అంతగా ఎదిగే అవకాశం బాబు గారివ్వరు అనేది ఆయన్ని దగ్గరగా చూసిన వారి మాట . ఒకవేళ అతనికి అవకాశం దక్కినా ఆ భూములు చివరికి బాబు గారి గూటికి చేరే ఆస్తులే అని టీడీపీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి .

ఇదే కుటుంబం నుండి వచ్చి మాస్ హీరోగా తర్వాతి తరం వారసుడిగా చెలామణి అవుతున్న యువ కదానాయకుడికి కూడా అవకాశం ఉంది కానీ తన వారసత్వానికి ముప్పులా పరిణమిస్తాడనే భయంతో బాబు గారు అతన్ని పార్టీకి దూరం పెట్టినందువలన అతనికీ అవకాశాలు తక్కువే అనుకోవచ్చు .

అలాగే ఆ స్థాయిలో డబ్బు వెచ్చించగల సత్తా ఉన్న మరో హీరో చిత్తూరు వాసి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఎంపీ గారికి స్వయానా బావ . ఈ ఎంపీ గారు చిత్తూరులో రైతుల భూములు దౌర్జన్యపూరితంగా ఐదారు వేల ఎకరాలు పోగు చేశారని స్థానిక పత్రికల్లో పదులకొద్దీ వార్తలొచ్చాయి . తమ ఫ్యాక్టరీ పక్కనున్న రైతు భూమి కబ్జా చేసి ఆ రైతు తల్లి అంతిమ సంస్కారానికి కూడా వారి భూమిలోకి వెళ్లకుండా కంచె వేసి పోలీసుల్ని కాపలా పెట్టిన ఘటన అప్పట్లో సంచలనం అయ్యింది . బాబు గారి వద్ద అపరిమిత పలుకుబడి ఉన్న ఆ ఎంపీ బామ్మర్ది అయిన గ్లామర్ హీరో ఈ భూములు ప్రోగు చేసి ఉండొచ్చు అనేది మరో విశ్లేషణ .

గత తరం అగ్ర హీరో ద్వయంలో ఒకరి వారసుడికి రియల్ రంగంలో అపార అనుభవం ఉంది కానీ టీడీపీతో అంతగా సత్సంబంధాలు లేవు . పైగా అతని రియల్ ఎస్టేట్ , స్టూడియో వ్యవహారాలన్నీ హైదరాబాద్ చుట్టూ తిరిగాయే తప్ప ఇతర ప్రాంతాల మీద ఆసక్తి చూపినట్టు లేదు . ఇతను రాజధాని అనే ఉద్దేశ్యంతో కొన్నా పదుల ఎకరాల్లోనే ఉంటుంది తప్ప ఐదొందల ఎకరాల అవకాశం టీడీపీ ఇవ్వకపోవచ్చు .

వీరు అయినా కాకపోయినా ఇటీవల తెలుగు సినీ చరిత్రలో ఉన్న కలెక్షన్ రికార్డ్ లన్నీ బ్రేక్ చేసిన సీక్వెల్ సినిమా హీరో , దర్శక ద్వయం అయ్యుండొచ్చు అని మరో అంచనా . ఇదీ కొట్టిపారేయటానికి వీల్లేదు .

సదరు భారీచిత్రంలో పలువురు టీడీపీ సన్నిహితులతో పాటు సదరు హీరో , నిర్మాతలు కూడా పెట్టుబడులు పెట్టి భారీ లబ్ది పొందారనేది జగమెరిగిన సత్యం . అంతే కాదు ఎక్కడ భారీ కట్టడాలు కనపడ్డా ఆయస్కాంతంలా ఆకర్షింపబడే బాబు సదరు చిత్రంలోని సెట్టింగ్స్ చూసి రాజధాని నిర్మాణాలు ఇలా చెయ్యాలని సంకల్పించి ఆ చిత్ర దర్శకునితో పలు దఫాలు చర్చలు జరిపి అంతర్జాతీయ కట్టడాలు , నమూనాలు పరిశీలించటానికి ఆయన్ని విదేశ పర్యటనకు కూడా పంపారు .

ఐదు వందల ఎకరాలు కొనే స్థాయి గల హీరోలు ప్రధానంగా వీరే , ఇంకా పలువురు పారిశ్రామిక వేత్తలు , సినీ హీరోలు కూడా భూములు కొన్నారని నర్మగర్భంగా ఆంధ్రజ్యోతి చేసిన వ్యాఖ్యలతో సినీ వ్యాపార రంగాలలో దిగ్గజాలు పలువురు భుజాలు తడుముకొంటున్నారని , కొన్నవారు ఆంధ్రజ్యోతి పై మండిపడుతున్నారని వినికిడి.

ఏదేమైనా రాజధానిలో ఇంసైడర్ ట్రేడింగ్ జరగలేదని , అసలు 1170 ఎకరాలకు మించి రిజిస్ట్రేషన్లు జరగలేదని దబాయిస్తున్న లోకేష్ కి , టీడీపీకి వారి ఆస్థాన దినపత్రికగా పేరు మోసిన ఆంధ్రజ్యోతి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు . ఇంసైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెపుతున్న వైసీపీ వాదనకి ఓ బలమైన సాక్ష్యం టీడీపీనే ఇచ్చింది అని చెప్పొచ్చు .

అయితే సదరు హీరోని ఇరికించే పథకంలో భాగంగా ఇది పొరపాటున జరిగిందా , లేక వారిని దారికి తెచ్చుకోటానికి తెగించి అమలు చేసిన వ్యూహమా అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే . ఏదేమైనా బాబు , రాధాల స్వార్ధ పూరిత రాజకీయ క్రీడలో ఎక్కడ ఇరుక్కుంటామో అని బినామీ పేర్లతో భూములు కొన్న పారిశ్రామిక , సినీ వర్గాలు గుండెలు చిక్కబట్టుకొని భయపడుతుంటారు అనడంలో అతిశయోక్తి లేదు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి