iDreamPost
android-app
ios-app

YCP MLC Aspirants – 14 ఎమ్మెల్సీ పదవులు.. ఆశానువాహులు ఎవరు..?

  • Published Nov 09, 2021 | 3:06 PM Updated Updated Mar 11, 2022 | 10:35 PM
YCP MLC Aspirants – 14 ఎమ్మెల్సీ పదవులు.. ఆశానువాహులు ఎవరు..?

ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి ఎన్నికల సందడి మొదలయ్యింది. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల కోటా భర్తీకి నోటిఫికేషన్ రావడంతో ఆశావహుల్లో హడావిడి మొదలయ్యింది. ఎవరికి వారు అధినేత ఆశీస్సులు తమకే దక్కుతాయనే ధీమాతో కనిపిస్తున్నారు. ఒకేసారి ఇటు ఎమ్మెల్యే కోటాలో 3 సీట్లతో కలుపుకుని 14 స్థానాలకు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసే అవకాశం రావడంతో పలువురు సీనియర్లకు చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది, కులాలు, ప్రాంతాల వారీగా పరిగణలోకి తీసుకుని, ఇప్పటికే అనేక మంది హామీ ఇచ్చిన నేపథ్యంలో వారి ఆశలు కూడా పండించే అవకాశం కనిపిస్తోంది. దాంతో జగన్ మనసులో ఎవరున్నారోననే చర్చ జోరుగా సాగుతోంది.

ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాలకు ఒక సీటు బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గోవిందరెడ్డికి ఖాయం అయిపోయింది. ఇటీవల ఉప ఎన్నికల్లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. గత మే నెలలో ఆయన పదవీకాలం ముగియడంతో రెన్యువల్ ఛాన్స్ దాదాపు ఖాయమే. ఇక మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి మహిళకు, మరోటి బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వరుదు కళ్యాణి తో పాటుగా ఇటీవల జెడ్పీ చైర్మన్ సీటు ఆశించిన రాజశేఖర్ పేరు కూడా వినిపిస్తోంది. వారిద్దరిలో ఒకరికి ఎమ్మెల్యే కోటా , మరొకరికి స్థానిక సంస్థల కోటాలో అవకాశం ఖాయమనే ధీమాతో కనిపిస్తున్నారు. విశాఖ జిల్లా నుంచి ఎస్టీ కోటాలో పలువురు ఆశిస్తున్నారు. విశాఖ నగరానికి చెందిన మైనార్టీ నేతలకు కూడా అవకాశం వస్తుందా అనే చర్చ సాగుతోంది.

తూర్పు గోదావరి జిల్లా నుంచి వైశ్య కోటాలో శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం రేసులో ఉన్నారు. ఆయన గతంలో ఏపీఐఐసీ చైర్మన్ గా పనిచేశారు.రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ గానూ కొంతకాలం ఉన్నారు. కాపు కోటాలో రంపచోడవరానికి చెందిన మాజీ డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. ఇటీవల ఈ జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు, పండుల రవీంద్రబాబుకి అవకాశం దక్కింది. దాంతో కాపు, ఎస్సీ కోటాలో మళ్లీ ఛాన్స్ వస్తుందా రాదా అన్నది ఆసక్తికరమే.

పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇటీవల మోషేన్ రాజు కి ఛాన్స్ రావడంతో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారోననే చర్చ మొదలయ్యింది. ఉండి నియోజకవర్గానికి చెందిన పాతపాటి సర్రాజు టికెట్ ఆశిస్తున్నారు. క్షత్రియులకే ఛాన్స్ వస్తుందని, భీమవరం ప్రాంతానికి చెందిన నేతలు ఆశాభావంతో ఉన్నట్టు తెలుస్తోంది. పగో జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు కూడా రేసులో ఉన్నారు. కాపుల కోటాలో ఎవరికైనా అవకాశం వస్తుందా అన్నది ప్రశ్నార్థకమే. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాలో పలువురు సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మర్రి రాజశేఖర్ కి దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఆయనకు ఎమ్మెల్యే కోటాలో కాకుండా స్థానిక సంస్థల కోటాలోనే పోటీకి ఛాన్స్ రావచ్చని తెలుస్తోంది. గుంటూరు కే చెందిన వారిలో ఇటీవల లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్ లకు జగన్ ఛాన్సిచ్చారు. ఈసారి మరొకరికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఇటీవల స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో ఛాన్స్ దక్కని వారు రేసులో ఉన్నారు. గన్నవరం నుంచి గత ఎన్నికల్లో బరిలో దిగిన యార్లగడ్డ వెంకట్రావు గట్టి ఆశలతో ఉన్నారు.

ప్రకాశం జిల్లాకు చెందిన ఆమంచి కృష్ణమోహన్ కి గతంలోనే ఆఫర్ వచ్చినా ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు మొగ్గు చూపారు. కానీ ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా రంగంలో ఉండే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆయన తో పాటుగా ఎస్సీ సామాజికవర్గం నుంచి ఒకరికి చాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. నెల్లూరు నేతల్లో కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. ఆశావాహుల సంఖ్య పెద్దదే ఉంది. దాంతో జగన్ దృష్టిలో పడేది ఎవరన్నది ఆసక్తికరమే. రాయలసీమకు చెందిన కర్నూలు జిల్లాలో లబ్బి వెంకటస్వామి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే కోటాలోనే ఆయన ఆశిస్తున్నారు మాదిగ కోటాలో అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఇంకా అనేక మంది యువనేతలకు ఛాన్స్ దక్కవచ్చని భావిస్తున్నారు. ఈసారి ఎమ్మెల్సీ కోటాలో యూత్ కే ప్రాధాన్యత ఉంటుందని అంచనా. మహిళలకు కూడా జగన్ ఎక్కువ మందిని ఎంపిక చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవుల్లో మైనార్టీలు, మహిళలకు జగన్ అవకాశాలిచ్చారు. దాంతో ఈసారి 14 పోస్టుల కోసం ఓసీ, బీసీ నేతలు గంపెడాశతో ఉన్నారు. ఎవరి కలలు పండేనో చూడాలి.

స్థానిక సంస్థల కోటాలో గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో రెండేసి సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో ఆయా జిల్లాలకు చెందిన వారికి ఎమ్మెల్యే కోటాలో సీటు కేటాయించే అవకాశం కనిపించడం లేదు. ఇక తూ గో , అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కో స్థానానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండడంతో ఆయా జిల్లాల నేతల మధ్య పోటీ కనిపిస్తోంది. ఈ 8 జిల్లాలు పోగా మిగిలిన జిల్లాల నేతలకే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందులో కడపకి ఒకటి ఖాయంగా చెప్పవచ్చు. శ్రీకాకుళం, కర్నూలు నేతలు ఈ రేసులో ఉంటారని భావిస్తున్నారు.