iDreamPost

ప్రకాష్ రాజ్, రాజశేఖర్లు ఇంకా కావాలి

ప్రకాష్ రాజ్, రాజశేఖర్లు ఇంకా కావాలి

నిన్న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ దిగ్విజయంగా ముగిసింది. 5 గంటలకు చప్పట్లు కొట్టే కార్యక్రమం అయ్యాక కొన్ని నగరాల్లో కొందరు అత్యుత్సాహంతో, తెలిసి తెలియనితనంతో సంబరాలు చేసుకోవడం విమర్శలకు దారి తీసింది. ఇదిలా ఉండగా గత రెండు వారాలుగా స్తంభించిపోయిన సినిమా పరిశ్రమ మీద పడిన లక్షలాది కుటుంబాలకు అందులోనూ రోజువారీ భృతి మీద లేదా జీతాల మీద ఆధారపడ్డ వాళ్ళకు జీవనోపాధి చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పలువురు నటులు దర్శకులు తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి.

టాలీవుడ్ నుంచి రాజశేఖర్ దంపతులు ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేసి తమ ఛారిటీ ద్వారా అవసరమైన వారికి సహాయం చేస్తామని ఒక వాట్స్ అప్ నెంబర్ కూడా విడుదల చేశారు. మరోవైపు ప్రకాష్ రాజ్ కూడా తనవంతుగా సిబ్బంది మీద ఎంత ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నానో ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన ఫార్మ్ హౌస్, ఫిలిం ప్రొడక్షన్, ఫౌండేషన్ మరియు మరియు వ్యక్తిగత స్టాఫ్ కు సంబంధించి మే నెల దాకా జీతాలు చెల్లించేశానన్న ప్రకాష్ రాజ్ డైలీ లేబర్ కు సైతం సగం జీతం ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని అందరూ ఒకరికి ఒకరు సహాయపడదామని పిలుపునిచ్చారు.

నిజానికి ఇప్పుడు ఇలాంటి చేతులే కావాలి. ఇప్పటికే హైదరాబాద్ లో లక్షలాది సంఖ్యలో షూటింగుల మీద ఆధారపడే ఎందరో ఆర్టిస్టులు, స్టాఫ్ ఆదాయం లేక ఇంట్లో ఉండలేక సతమతమవుతున్నారు. అందుకే వాళ్ళకు కొంత ఉపశమనం కలిగేలా ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా అవసరం. టాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం ఈ దిశగా ఒక్కొక్కరు తమ చేయూతను ప్రకటిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఎలాగూ పరిస్థితి ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు కాబట్టి అందరూ ఈ కోణంలో ఆలోచిస్తే ఎందరివో ఆకలి బాధలు తీరతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి