iDreamPost

లాక్ డౌన్ ను పొడిగిస్తూ మోడీ ప్రజలకు సూచించిన సూత్రాలివే..

లాక్ డౌన్ ను పొడిగిస్తూ మోడీ ప్రజలకు సూచించిన సూత్రాలివే..

రోజు రోజుకు దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా ధాటికి ఇప్పటికే అగ్రరాజ్యంతో సహా పలు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. దీనితో ముందు జాగ్రత్తగా దేశంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి దేశంలో గత నెల 24 నుండి ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ను విధిస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. అయినా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించడంతో దాదాపు 10000 కు పైగా పాజిటివ్ కేసులు దేశంలో నిర్దారణ అయ్యాయి. 339 మంది మృతి చెందారు. దీనితో రెండోసారి కూడా లాక్ డౌన్ విధిస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. మరో 19 రోజులు లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

దేశ ప్రజలంతా లాక్ డౌన్ ను గొప్పగా విజయవంతం చేస్తున్నారని వెల్లడించిన మోడీ ప్రజలంతా ఏడు సూత్రాలను పాటించి కరోనాను గెలవాలని ప్రజలకు తెలిపారు. 

మోడీ ప్రసంగంలోని సారాంశాన్ని పరిశీలించి చూస్తే కరోనాను దానివల్ల ఏర్పడిన నష్టాలను ఆయన చెప్పిన సూత్రాలను పాటించి విజయం సాధించవచ్చని తెలుస్తుంది.

1. లాక్‌డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని,సామాజిక దూరం ప్రతి ఒక్కరు పాటించాలని మోడీ తెలిపారు. ఇంట్లో మాస్కులను తయారుచేసి ఉపయోగించుకోవాలని సూచించారు.

2. వృద్ధులపై కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ కాబట్టి ఇంట్లో ఉన్న వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని అంతకు ముందే ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వారిని మరింత జాగ్రత్తగా గమనించాలని,వారికి కరోనా వ్యాప్తి చెందకుండా కాపాడుకోవాలని మోడీ తెలిపారు.

3. రోగ నిరోధక శక్తిని అందరూ పెంచుకోవాలని, అందుకోసం ఆరోగ్యశాఖ ఇచ్చిన సూచనలు పాటించాలని వ్యాఖ్యానించారు.

4. ఆరోగ్య సేతు అప్లికేషన్ ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని, తెలిసిన వారికి కూడా డౌన్లోడ్ చేయమని సూచించాలని మోడీ వెల్లడించారు. ఈ ఆప్ ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయొచ్చని తెలిపారు.

5. దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటం చేస్తున్న యోధులు డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులను గౌరవించాలని సూచించారు. వారు చేస్తున్న పోరాటం గొప్పదని ప్రశంసించారు.

6. లాక్ డౌన్ కారణంగా ఆకలితో బాధపడుతున్న పేదలకు సహాయం చేయాలని వారి ఆకలి కష్టాలను తీర్చే ప్రయత్నం చేయాలని మోడీ సూచించారు.

7. తోటి ఉద్యోగుల పట్ల దయతో వ్యవహరించాలని, ఏ కంపెనీ కూడా ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేయొద్దని మోడీ తన ప్రసంగాన్ని తెలిపారు.

కరోనాపై విజయం సాధించడానికి పై సూత్రాలను ప్రజలంతా పాటించాలని మోడీ స్పష్టం చేశారు. లాక్డౌన్ పూర్తి అయ్యేవరకు ప్రజలంతా ఈ సూత్రాలను నిష్ఠగా పాటించాలని ప్రభుత్వానికి సహకరించాలని మోడీ ప్రజలకు సూచించి ప్రసంగాన్ని ముగించారు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి