iDreamPost

సినిమా స్టైల్ క్రైమ్ స్టోరీ! యువతి కోసం రంగంలోకి ఏకంగా ముఖ్యమంత్రి!

సినిమా స్టైల్ క్రైమ్ స్టోరీ! యువతి కోసం రంగంలోకి ఏకంగా ముఖ్యమంత్రి!

రితీ సాహా కేసు ఇప్పుడు పోలీసులకు చుక్కలు చూపిస్తుంది. ఈ అమ్మాయి చనిపోయి నెల దాటినా.. ఇంత వరకు ఆమె చావుకి గల కారణం ఏంటనే అసలు నిజ నిజాలు బయటపడలేదు. అయితే ఇదే కేసు ఇప్పుడు రెండు రాష్ట్రాల పోలీసులకు సవాల్ గా మారింది. మరో విషయం ఏంటంటే? రితీ సాహా కేసు ఏకంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ దృష్టికి వెళ్లింది. ఆమె సీరియస్ అయి మంత్రికి ఆదేశాలు జారీ చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సినిమా స్టైల్ క్రైమ్ స్టోరీలా ఉన్న రితీ సాహా కేసులో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన రితీ సాహా అనే అమ్మాయి విశాఖలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతుంది. స్థానికంగా ఉన్న నెహ్రబజార్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ ఉంటూ కాలేజీకి వెళ్లేది. ఇదిలా ఉంటే.. గత నెల 14న రాత్రి హాస్టల్ 4వ అంతస్తుపై నుంచి దూకి రితీ సాహా చనిపోయిందని ఆమె తల్లిదండ్రులకు హాస్టల్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన విశాఖకు చేరుకున్నారు. ఆ తర్వాత విగత జీవిగా పడి ఉన్న కూతురుని చూసి మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు.

దీనిపై స్పందించిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోలీసులు, హాస్టల్ సిబ్బంది రితీ సాహా తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. కానీ, ఎందుకో మృతురాలి తల్లిదండ్రులకు కూతురి మరణంపై అనేక అనుమానాలు వచ్చాయి. ఇక సైతం రితీ సాహా తల్లిదండ్రులు ఆ హాస్టల్ ఎదురుగా ఉన్న ఓ సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ సీసీ ఫుటేజ్ చూసి సంచలన నిజాలు తెలుసుకున్నారు. రితీ సాహా 4వ అంతస్తుకు వెళ్లేటప్పుడు ఒక డ్రెస్ లో ఉండగా, కిందపడిపోయేటప్పుడు మరో కలర్ డ్రెస్ లో కనిపించిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.

దీంతో మృతురాలి కుటుంబ సభ్యుల అనుమానం మరింత బలపడింది. మా కూతురుని ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇక ఇదే సమయంలో రితీ సాహా తల్లిదండ్రులు ఈ కేసును ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఆదేశాలతో అక్కడి పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసుపై విశాఖ డీసీపీ-1 విద్యాసాగర్ నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రితీ సాహా మృతిపై సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత విచారణ చేపడతామని తెలిపారు. ఇంతకు రితీ సాహా ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? అనే వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇది కూడా చదవండి: సినిమా స్టైల్లో భార్య స్కెచ్.. భర్తను నమ్మించి తీసుకెళ్లి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి