iDreamPost

అధికారిక ప్రకటనే ఆలస్యం – విశాఖే కార్యనిర్వాహక రాజధాని

అధికారిక ప్రకటనే ఆలస్యం – విశాఖే కార్యనిర్వాహక రాజధాని

రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధానిపై జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన నివేదకలోని అంశాలను కొంచెం అటు ఇటుగా మంత్రివర్గం ఆమోదించే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా మూడు రాజధానుల ఏర్పాటు తప్పక ఉండనుంది. కర్నూలును న్యాయ రాజధాని, అమరావతి శాసన రాజధాని, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయనున్నారని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అధికారికంగా ప్రకటించడమే ఇక మిగిలిందని, ఇప్పటికే శాసన సభలో సీఎం చెప్పిన ప్రకటనకు కట్టుబడినట్లు వైఎస్సార్‌సీపీ నేతల చర్యలతో అర్థమవుతోంది. రేపు శనివారం సీఎం విశాఖలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు కోసం వైఎస్సార్‌సీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి దాదాపు 24 కిలోమీటర్ల మేర మానవహారంగా ఏర్పడి సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినందుకుగాను ’థాంక్యూ సీఎం’ ప్లకార్డులో సీఎం జగన్‌కు తమ కృతజ్ఞతలు చెప్పేందుకు విశాఖ సిద్ధమవుతోంది.

విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి వరకు, కైలాస గిరి నుంచి బీచ్‌ రోడ్డు వరకు ఈ మానవహారం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండడంతో కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను మంత్రివర్గం అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి