iDreamPost

ఈ నిర్లక్ష్యమే వణికిస్తోంది..!

ఈ నిర్లక్ష్యమే వణికిస్తోంది..!

కంటికి కన్పించిన ఓ క్రిమి నానా పాట్లు పెడుతోంది. దీని భారి నుంచి తోటి మనుషులను కాపాడుకోవడానికి తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా యంత్రాంగం సేవలందిస్తోంది.. ఇటువంటి పరిస్థితుల్లో పౌరుడిగా ఎంత బాధ్యతగా ఉండాలి.. అందులోనూ కాస్తంత అక్షరజ్ఞానం ఉన్న వాళ్ళు ఇంకెంత బాధ్యతగా వ్యవహరించాలి.. తనకు తాను జాగ్రత్తగా ఉండడంతో పాటు.. తోటి వారిని హెచ్చరిస్తూ వాళ్ళు కూడా జాగ్రత్తపడే విధంగా చైతన్య పరచాలి. అంతేగానీ ఇవేమీ పట్టకుండా తమ మానాన తాము తప్పించుకు తిరిగేవాళ్ళనేమనాలి.. సాటి మనుషులే కదా అని ఊరుకున్నప్పటికీ వీరు తెస్తున్న క్రిమి మాత్రం జనాన్ని వదలడం లేదు.

2020లో మన దేశంలోకి ప్రవేశించిన కరోనా తన సామర్ధ్యానికంటే మనలోని నిర్లక్ష్యాన్నే ఆసరగా చేసుకుని పేట్రేగిపోయిందనే చెప్పాలి. ఈ వ్యాధి వ్యాప్తిలో.. దీని భారిన పడ్డామని తెలిసినప్పటికీ జనసమూహాల్లోకి వెళ్ళిపోయిన వారిది సింహభాగంగానే చెప్పుకోవాలి. ఇప్పుడు కరోనా కొత్త స్ట్రెయిన్‌ విషయంలో కూడా ఇదే రిపీట్‌ అవుతుండడం సర్వత్రా ఆందోళన పరుస్తున్న అంశమైపోయింది. ఇతర దేశాల నుంచి వస్తున్న వాళ్ళలో కొందరు తమ చిరునామా, ఫోన్‌ నంబర్లను తప్పుగా ఇస్తుండడంతో వారిని గుర్తించడం యంత్రాంగానికి కష్టంగా మారిపోతోంది. ఇలా వస్తున్న వారిలో బాధ్యతగా వ్యవహరించే వాళ్ళు కూడా లేకపోలేదు. అక్కడి నుంచి దిగగానే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు వ్యవహరించి తమ బాధ్యతను చక్కగానే పలువురు నిర్వర్తిస్తున్నారు. కానీ కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి మొత్తం దేశ ప్రజలందర్నీ ప్రమాదం అంచులోకి తీసుకువెళుతున్నారు. బాధ్యతగా నడుచుకున్న వారిపై కూడా నిందలు పడే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ తరహా ప్రవర్తన సమర్ధనీయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఒక్క యూకే నుంచి తిరిగి వచ్చిన ప్రయాణీకుల్లో పంజాబ్‌లో 3,500 మంది, కర్నాటకలో 570 తెలంగాణాలో 279 మంది, ఒడిస్సాలో 30 మంది, ఉత్తరాఖండ్‌లో 20 మంది తప్పుడు చిరునామాలు, ఫోన్‌నంబర్లు ఇచ్చినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. దీంతో వీరి ఆచూకీని కనిపెట్టడం యంత్రాంగానికి సాధ్యం కావడం లేదంటున్నారు.

ఇప్పటికే చిరునామాలు గుర్తించిన వారికి జరిపిన వైద్య పరీక్షల్లో పలువురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో కొందరికి న్యూ స్ట్రెయిన్‌ ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. మరి అడ్రస్‌లు మిస్సైన వారిలో ఎవరికైనా కోవిడ్‌ పాజిటివ్, అందులోనూ న్యూ స్ట్రెయిన్‌ ఉంటే పరిస్థితి ఏంటి? అన్న తలంపు వస్తేనే వెన్నులోనుంచి వణుకు ప్రారంభం కాకమానదు. ఇలా మిస్సైన వాళ్ళు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోండని అధికార యంత్రాంగం చేతులెత్తి మొక్కుతున్నప్పటికీ వీరిలో కదలిక వస్తున్న దాఖలాలు కన్పించడం లేదు.

యూకే నుంచి వచ్చి ఢిల్లీ సెల్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్న రాజమహేంద్రవరం నగరానికి చెందిన ఒక మహిళ ఆచూకీని గుర్తించేందుకు ఢిల్లీ నుంచి ఏపీ వరకు కేంద్ర ప్రభుత్వ బలగాలు, రాష్ట్ర పోలీస్, ఇంటిలిజెన్స్‌ యంత్రాంగం, రైల్వే, రెవిన్యూ.. తదితర శాఖల్లోని వేలాది మంది సిబ్బంది దాదాపు 15 గంటలు తీవ్రమైన కసరత్తు చేసి, చివరికి గుర్తించగలిగారు. అటువంటిది ఇంత మందిని గుర్తించడం అంటే మాటలు కాదు. ఇప్పుడు మన దేశంలో కొత్త స్ట్రెయిన్‌ వ్యాప్తికి ఆచూకీ లభించని వారే కారణం అవుతారేమోనని నిపుణులు ఆందోళన పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి