iDreamPost

ప్రపంచ ప్రేమికుడికి పెద్ద సవాలే

ప్రపంచ ప్రేమికుడికి పెద్ద సవాలే

అర్జున్ రెడ్డి రాకముందు వరకు అతనో హీరో అంతే. పెళ్లి చూపులు బాగా ఆడినా అతనిలోని అసలైన ఫైర్ బయటికి తెచ్చింది మాత్రం సందీప్ రెడ్డి వంగానే. యూత్ లో దీని దెబ్బకు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు ఆ తర్వాత గీత గోవిందం రూపంలో దక్కిన ఇండస్ట్రీ హిట్ ఇంకెక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. డేట్లు హాట్ కేక్స్ లా మారిపోయాయి. టాక్సీ వాలా పర్వాలేదు అనిపించుకుంది. కాని నోటాతో మొదలైన పరాజయాల పరంపర డియర్ కామ్రేడ్ తో పీక్స్ కు చేరింది. నిర్మాతగా మీకు మాత్రమే చెప్తాను సైతం నిరాశ కలిగించే ఫలితాన్నే ఇచ్చింది .

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ క్రేజ్ కు వచ్చిన నష్టమేమీ లేదు కానీ ఇప్పటికిప్పుడు సాలిడ్ హిట్ తో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చి పడింది. అందుకే తన ఆశలన్నీ వరల్డ్ ఫేమస్ లవర్ మీదే పెట్టుకున్నాడు. నలుగురు అమ్మాయిలతో లవ్ ట్రాక్ నడిపించే నవలా రచయితగా విజయ్ ఇందులో చాలా విభిన్నమైన పాత్ర చేస్తున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. అయితే ఇటీవలే విడుదలైన టీజర్ మరో అర్జున్ రెడ్డి రిప్లికాలా ఉందంటూ సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి.

సో వరల్డ్ ఫేమస్ లవర్ సక్సెస్ విజయ్ దేవరకొండకు చాలా కీలకం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన ఫైటర్ ఇంకా పట్టాలు ఎక్కనే లేదు. స్క్రిప్ట్ ఇంకా లాక్ అవ్వలేదని. సినిమా నిర్మాణానికి సంబంధించి పూరి చార్మీకి మధ్య ఏవో విభేదాలు వచ్చాయని రకరకాలుగా ఫిలిం నగర్ ప్రచారం సాగుతోంది. ఈ నేపధ్యంలో వరల్డ్ ఫేమస్ లవర్ ఫిబ్రవరి 14న విడుదల కాగానే ఫైటర్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళాల్సి ఉంటుంది.

కొత్తగా ట్రై చేయడం లేదు అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ లోనే సినిమాలు చేస్తున్నాడన్న నింద పోవాలి అంటే విజయ్ దేవరకొండ విభిన్నమైన సబ్జెక్టులను ఎంచుకోక తప్పదు. తక్కువ్ టైంలోనే స్టార్ డం వైపు అడుగులు వేస్తున్న హీరోకు స్పీడ్ బ్రేకర్స్ లాంటి ఫ్లాపులు తగిలినప్పుడు వీలైనంత త్వరగా కోలుకుని హిట్స్ అందుకోవాలి. ఇప్పుడు విజయ్ దేవరకొండ ముందున్న సవాల్ ఇదే. అన్నట్టు ఈ కారణంగానే న్యుమరాలజి ప్రకారం టైటిల్స్ లో దేవరకొండ విజయ్ సాయి అని వేయించుకున్నాడు కాబోలు. ఈ సెంటిమెంట్ ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి