iDreamPost

గురి తప్పిన ‘సాహస వీరుడు’ – Nostalgia

గురి తప్పిన ‘సాహస వీరుడు’ – Nostalgia

తెలుగు సినిమాను మాస్ ఆడియన్స్ పరంగా విపరీతంగా ప్రభావితం చేసిన దర్శకుల్లో కె రాఘవేంద్రరావు గారిది ప్రత్యేక స్థానం. అడవి రాముడుతో మొదలుకుని ఘరానా మొగుడు దాకా ఇండస్ట్రీ రికార్డులు సాధించిన ఆణిముత్యాలు ఎన్నో. అందుకే వంద సినిమాల ప్రస్థానంలో ఈయన అందుకున్న పరాజయాలు తక్కువే. కాని ఒక్కోసారి లెక్కలు మారి అంచనాలు మితిమీరి దెబ్బ తినడం ఇలాంటి తలపండిన దర్శకేంద్రులకు కూడా జరుగుతుంది. 1996లో అలాంటి అనుభవమే ఎదురయ్యింది.

వెంకటేష్ హీరోగా బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాణంలో రాఘవేంద్ర రావు గారు ఓ భారీ ఫాంటసీ చిత్రం ప్లాన్ చేశారు. బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టిని తెరకు పరిచయం చేస్తూ కన్నడలో వెలిగిపోతున్న మాలాశ్రీని సెకండ్ హీరొయిన్ గా హెవీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సాహసవీరుడు సాగరకన్య టైటిల్ అనౌన్స్ చేయగానే బిజినెస్ లోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. 1990లో వచ్చిన మాస్టర్ పీస్ జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత రాఘవేంద్రరావు మరో ఫాంటసీ సినిమా చేయలేదు. దాంతో వెంకీ మూవీ దాన్ని మించిన స్థాయిలో ఉంటుందనే అంచనాలు విపరీతంగా పెరిగిపోవడం మొదలయ్యింది. విడుదలకు ముందు వచ్చిన కీరవాణి ఆడియో సూపర్ హిట్ అయ్యింది.

అన్ని శుభశకునాలే అనిపించాయి. ఓ మత్స్య కన్యకు, సామాన్య మానవుడికి మధ్య ప్రేమకథకు ఓ మాంత్రికుడి ట్రాక్ ని జోడించి పరుచూరి బ్రదర్స్ రచనలలో రాఘవేంద్రరావు మాయాజాలం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. తారాగణం కూడా హెవీగా తీసుకున్నారు. సత్యనారాయణ, కోట, శ్రీహరి, బాబూమోహన్, బ్రహ్మానందం, సుధాకర్, ఆలి ఇలా పెద్ద సెటప్పే ఉంది. అయినా కూడా యావరేజ్ రిజల్ట్ తో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. కథనంలో తడబాటు కారణంగా ప్రేక్షకులు కోరుకున్న అంశాలు ఇందులో పూర్తిగా పండలేకపోయాయి.స్టార్ హీరో సినిమాకు హైప్ మరీ ఎక్కువైనా ఇబ్బందే. సాహసవీరుడు సాగరకన్య విషయంలో అది రుజువయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి