iDreamPost

వెంకయ్యకు ఆ బాధ ఉంది.. ఆ ఆశ కూడా ఉంది..

వెంకయ్యకు ఆ బాధ ఉంది.. ఆ ఆశ కూడా ఉంది..

ముప్పవరపు వెంకయ్యనాయుడు.. పరిచయం అవసరంలేని పేరు. తన వాక్ఛాతుర్యంతో రాజకీయాల్లో ఉన్నతస్థాయికి ఎదిగారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా, కేంద్ర మంత్రిగా పలుమార్లు పనిచేసిన ఆయన.. ప్రస్తుతం దేశ ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వెంకయ్యనాయుడును 2017లో బీజేపీ అగ్రనాయకత్వం ఉప రాష్ట్రపతిగా పంపింది. అయితే కేంద్ర మంత్రిగానే ఉండేందుకే మొగ్గుచూపిన వెంకయ్య.. అయిష్టంగానే ఉప రాష్ట్రపతి పదవి స్వీకరించారు.

అయిష్టంగా పదవి స్వీకరించిన వెంకయ్య.. ఆ బాధను ఇప్పటికీ వెళ్లగక్కుతున్నారు. ఈ ఏడాది ఆగష్టు నాటికి ఆయన ఐదేళ్ల పదవీకాలం ముగిసిపోతోంది. పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ తరచూగా ఆయన ఉప రాష్ట్రపతి అయ్యాక ప్రజలకు దూరం అయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ‘నా చేతులు, కాళ్లు, నోరు కట్టేశారు’ అంటూ బాధపడిపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన వెంకయ్యనాయుడు… మరోసారి తన బాధను వ్యక్తం చేశారు. మంగళవారం పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఉప రాష్ట్రపతి అయ్యాక తాను ప్రజలకు దూరమయ్యానని, ఒకప్పటిలా తరచూగా అన్ని కార్యక్రమాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందని తన ఆవేదనను మరోసారి వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి పదవిపై ఆశలు..

రాష్ట్రపతి పదవిపై తనకు ఆశ ఉందని.. వెంకయ్య నాయుడు చెప్పకనే చెబుతున్నారు. తాను మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని కొందరు కోరుకుంటున్నారంటూ.. పరోక్షంగా తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పలేనన్నారు. ఈ ఏడాది జూన్‌లో రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఐదేళ్ల పదవీకాలం ముగియబోతోంది. కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ జూన్‌లో ప్రారంభమవుతుంది. బీజేపీ నిలబెట్టిన అభ్యర్థే రాష్ట్రపతిగా ఎన్నికవ్వడం లాంఛనమే కానుండడంతో వెంకయ్య ఆ పదవిపై ఆశలు పెంచుకుంటున్నారు.

రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేది బీజేపీ ఇంకా నిర్ణయించలేదు. పలు పేర్లను పరిశీలిస్తోంది. జేడీయూ నేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ పేరును రాష్ట్రపతి పదవికి పరిశీలిస్తున్నట్లు ఇటీవల మీడియాలో ప్రచారం జరిగింది. బీజేపీ–జేడీయూ పార్టీలు కలిసి బీహార్‌లో అధికారం పంచుకుంటున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ కన్నా జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినా.. ముందుగా అనుకున్న ప్రకారం జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌కే సీఎం పదవి దక్కింది. ఇప్పుడు ఆయన్ను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసి, బీహార్‌లో పాలనా పగ్గాలు చేపట్టాలని బీజేపీ ఆశిస్తోంది. ఇలాంటి తరుణంలో వెంకయ్య తన మనసులోని మాటను వెల్లడించడం విశేషం. మరి వెంకయ్య ఆశ నెరవేరుతుందా..? లేదా బీజేపీ రాజకీయ సమీకరణాల్లో ఆ ఆశ ఆవిరైపోతుందా..? చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి