iDreamPost

తెలుగుదేశం ఎమ్మెల్సీలకు తీవ్ర నిరాశ.. ఢిల్లీలో దక్కని అపాయింట్మెంట్

తెలుగుదేశం ఎమ్మెల్సీలకు తీవ్ర నిరాశ..  ఢిల్లీలో దక్కని అపాయింట్మెంట్

రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేయడంపై ఫిర్యాదు చేసేందుకు తెలుగుదేశం ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు తలపెట్టిన ఢిల్లీ పర్యటన రద్దయినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్సీలు మంగళవారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి మండలి రద్దుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించారు. అయితే వారికి ఢిల్లీలో ముఖ్య నేతలెవరూ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని సమాచారం. ఈ కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

శాసనమండలి రద్దు నిర్ణయంపై అమిత్‌ షాను కలవాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. అయితే ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్సీలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇ‍వ్వడానికి నిరాకరించారు. అయితే అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే మండలి రద్దుకు సహకరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం అమిత్‌ షాను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్ షా టిడిపి ఎమ్మెల్సీలను కలవడానికి ఆసక్తి చూపక పోవడంపై రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతుంది.

అయితే ప్రధాని, అమిత్ షా ఆపాయిన్మెంట్ దొరకకపోయినప్పటికీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఢిల్లీ వెళ్లి మొదట ఉపరాష్ట్రపతి కలుస్తామని.. ఆ తరువాత ఈ నెల 24 న మరోసారి ఢిల్లీ వెళ్లి ప్రధాని, అమిత్ షా అపాయింట్మెంట్ కోరతామని టిడిపి ఎమ్మెల్సీలు ఈ రోజు ఉదయం వరకు చెప్పుకొచ్చారు. చివరి నిమిషంలో ఏమి జరిగిందో కారణాలు బయటకి తెలియక పోయినప్పటికీ, టిడిపి ఎమ్మెల్సీలు తమ ఢిల్లీ పర్యటనను చివరి నిమిషంలో అర్ధాంతరంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి