iDreamPost

నిన్న రాజ్య సభలో వెంకయ్యే ఉండుంటే..?

నిన్న రాజ్య సభలో వెంకయ్యే ఉండుంటే..?

ఎన్‌డీఏ – 2 అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సమావేశాల్లో ఈ స్థాయిలో గందరగోళం చెలరేగడం మొదటిసారి. రాజ్యసభలో సంఖ్యాబలం లేకున్నా కూడా బీజేపీ తన రాజకీయ చతురత, తటస్థ రాజకీయ పార్టీల అవసరాల వల్ల బిల్లులు పాస్‌ అవుతున్నాయి. అయితే నూతనంగా తెచ్చిన వ్యవసాయ బిల్లుపై మాత్రం కథ అడ్డం తిరిగింది. ఊహించని విధంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఎన్‌డీఏ భాగస్వామి అయిన శిరోమణి అకాళిదల్‌ నిర్ణయం తీసుకోవడం, ఆ పార్టీ నేత హర్‌ సిమ్రత్‌ కౌర్‌ మంత్రి పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.

దీంతో ప్రతిపక్షాలకు కొండంత బలం లభించింది. ఈ బిల్లును సభా సంఘాలకు పంపాలని డిమాండ్‌ చేయడంతో నిన్న రాజ్యసభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో సభను డిప్యూటీ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికయిన హరివంశ్‌ సింగ్‌ నడిపిస్తున్నారు. ప్రతిపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చుతూ బిల్‌ను మూజు వాణి ఓటుతో పాస్‌ చేయడంతో ప్రతిపక్ష పార్టీల సభ్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధ్యక్ష స్థానంపైకి పేపర్లు విసరడం, దురుసు ప్రవర్తనలు చోటుచేసుకున్నారు. దాని ఫలితంగా ఈ రోజు సభ ప్రారంభం కాగానే చైర్మన్‌ ముప్పువరపు వెంకయ్య నాయుడు 8 మంది విపక్ష పార్టీల సభ్యులను వారం రోజులపాటు సస్పెండ్‌ చేశారు.

కారణాలేమో తెలియదు గానీ నిన్న సభలో హరివంశ్‌ స్థానంలో వెంకయ్య నాయుడు ఉండుంటే.. పరిస్థితి మరోలా ఉండేది. ఈ రోజు 8 మంది సభ్యులపై సస్పెన్సన్‌ వేటు పడేది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయిన 2017 నుంచి సభను హుందాగా నడిపిస్తున్నారు. సభ పనితీరు మెరుగ్గా ఉంది. సభ్యుల హాజరు బాగుంది. రాజ్య సభ ఎన్ని పనిదినాలు నడిచింది, ఏ స్థాయిలో ఫలితాలు రాబట్టింది, ఎన్ని బిల్లులు పాస్‌ అయిందనే వివరాలతో ప్రతి ఏడాది వెంకయ్య నాయుడు తన పనితీరుపై నివేదిక విడుదల చేస్తున్నారు. లౌక్యం తెలిసిన మాటకారి, నిబంధనలు తెలిసిన రాజనీతిజ్ఞుడు అయిన 71 ఏళ్ల వెంకయ్య నాయుడు నిన్న వ్యవసాయ బిల్లు సభ ముందుకు వచ్చిన సమయంలో సభను నడిపించి ఉంటే తాజా పరిణామాలు జరిగి ఉండేవి కావనేవి వెంకయ్య నాయుడు అభిమానులు చెబుతున్న మాట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి