iDreamPost

వడివడిగా వెలిగొండ ప్రాజెక్ట్! ఓర్వలేక టీడీపీ విద్వేష రాజకీయం!

  • Published Nov 29, 2023 | 5:25 PMUpdated Nov 30, 2023 | 12:05 PM

తమ ధనార్జన కోసం వెలిగొండ ప్రాజెక్ట్ ను వాడుకున్న పచ్చ నేతలు.. సీఎం జగన్ చొరవ వల్ల తుది దశకు చేరుకున్న సమయంలో.. దాని మీద అసత్య ప్రచారానికి దిగారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎవరి పాత్ర ఎంత.. ఎవరేం చేశారు అనే వివరాలు మీ కోసం..

తమ ధనార్జన కోసం వెలిగొండ ప్రాజెక్ట్ ను వాడుకున్న పచ్చ నేతలు.. సీఎం జగన్ చొరవ వల్ల తుది దశకు చేరుకున్న సమయంలో.. దాని మీద అసత్య ప్రచారానికి దిగారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎవరి పాత్ర ఎంత.. ఎవరేం చేశారు అనే వివరాలు మీ కోసం..

  • Published Nov 29, 2023 | 5:25 PMUpdated Nov 30, 2023 | 12:05 PM
వడివడిగా వెలిగొండ ప్రాజెక్ట్! ఓర్వలేక టీడీపీ విద్వేష రాజకీయం!

సుమారు 27 సంవత్సరాల తర్వాత వెలిగొండ ప్రాజెక్ట్ లబ్ధిదారుల కల త్వరలోనే నిజం కాబోతుంది. ప్రాజెక్టు ముగింపు దశకు వచ్చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పాలన అందిస్తూనే.. సాగు,తాగు నీటి ప్రాజెక్ట్ ల నిర్మాణానికి కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రాజెక్ట్ లన్నింటిని శరవేగంగా పూర్తి చేస్తూ.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ప్రభుత్వం మీద విషం కక్కే టీడీపీ నేతలు.. మరోసారి తమ కుటిల బుద్ధి చాటుకున్నారు. ముగింపు దశకు చేరుకున్న వెలిగొండ ప్రాజెక్ట్ పై విషం చిమ్మారు

అంతేకాక వ్యసాయం దండగ, ప్రాజెక్ట్ లు కడితే ఖర్చు ఎక్కువ.. ఆదాయం తక్కువ, వ్యవసాయం దండగ, కరువుకు తుపానే మందు అంటూ.. రైతాంగం, వ్యవసాయం మీద తన వ్యతిరేకతను చాటుకున్న చంద్రబాబును.. ఇప్పుడేమో రైతు బాంధవుడిగా, వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసిన ఘనుడిగా చూపించేందుకు టీడీపీ చేస్తోన్న ప్రయత్నాలు అన్ని ఇన్నీ కావు. ఒక్కసారి ప్రాజెక్ట్ చరిత్రను పరిశీలిస్తే.. దీని నిర్మాణంలో ఎవరి పాత్ర ఏంటి.. ఎవరి కృషి ఎంత.. ప్రాజెక్ట్ విషయంలో ఎవరు ఎంత చిత్తశుద్దిగా వ్యవహరించారు అనేది అర్థం చేసుకోవచ్చు.

వెలిగొండ ప్రాజెక్టు చరిత్ర ఇది..

ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాల్లోని 29 మండలాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు.. 15.25 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టే వెలిగొండ ప్రాజెక్టు. దీనిలో భాగంగా కృష్ణా నదిలో 43.5 టీఎంసీల వరద నీటిని కొల్లంవాగు సమీపంలోని శ్రీశైలం రిజర్వాయర్ నుండి తరలించి నల్లమలసాగర్ రిజర్వాయర్లో నిల్వ చేయాలని ప్రతిపాదించారు.

మార్కాపురం యర్రగొండపాలెం నుంచి అనేక సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన “పూల సుబ్బయ్య” గారి పేరు మీద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. కమ్యునిస్ట్ (సీపీఐ) నాయకుడైన పూల సుబ్బయ్య గారు ప్రకాశం జిల్లాతో పాటు మరికొన్ని జిల్లా ప్రాంతాలకు సాగునీరు, త్రాగునీరు అందించడానికి ఎనలేని పోరాటం చేసారు. ఆయన కృషికి గుర్తుగా దీన్ని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ అని పిలుస్తున్నాము.

ప్రాజెక్ట్ నిర్మాణం సాగుతుందిలా..

ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా.. శ్రీశైలం డ్యాం ఎగువున.. నల్లమల అడివిలో కొల్లం వాగు కృష్ణా నదిలో కలిసేచోట నుంచి గ్రావిటీతో 43.5 టీఎంసీల వరద నీటిని 200 మీటర్ల అప్రోచ్ చానల్ ద్వారా పారించి.. అక్కడి నుంచి 18.8 కి.మీ పొడవున 2 సమాంతర సొరంగాల ద్వారా దోర్నాల-కర్నూల్ రహదారిలో కొత్తూరు వరకు నీటిని పారించి అక్కడ నుంచి సుమారు 22 కి.మీ పొడవైన కాలువ ద్వార నల్లమల సాగర్ లో నిలవ చేసి అక్కడి నుంచి వివిధ కాలువల ద్వార నిర్దేశిత ప్రాంతాలకు నీటిని అందించేలా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని భావించారు.

ఈ ప్రాజెక్ట్ కోసం కొండల శ్రేణుల మధ్య ఖాళీ స్థలంలో ఉన్న సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల అనే మూడు ఊర్ల దగ్గర గోడలలాగ ఆనకట్టలు కట్టి సుమారు 20 కి.మీ పొడవైన సహజమైన నల్లమల సాగర్ రిజర్వాయర్ ని నిర్మించారు. ఇది నల్లమలను ఆనుకోని ఉండటం వలన అనేక అడవి వాగులు వచ్చి ఇందులో కలుస్తున్నాయి.

Veligonda project

ఎన్నికల కోసం చంద్రబాబు శిలాఫలకాలు..

వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తొలిసారి 1996 మార్చ్ 5వ తారీకున ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మార్కాపురానికి 15 కి.మీ దూరంలో వున్న గొట్టిపడియ దగ్గర సుమారు రూ.980 కోట్ల అంచనాతో శంకుస్థాపన చేశారు. పెద్దపులులు తిరిగే అటవీ ప్రాంతంలో టన్నెల్ నిర్మించాల్సి ఉన్నందున.. కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు తీసుకుని.. 5 ఏళ్ల వ్యవధిలో ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ 4 సంవత్సరాలు పాటు అనగా 2000 సంవత్సరం వరకు కూడా కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు తీసుకురాలేదు.

2001లో టెక్నికల్ ఎడ్వైజర్ కమిటీ వేశారు. కమిటి రిపోర్టు ఇచ్చిన తరువాత ఒక స్విజర్లాండ్ కంపెనీకి 2.5 కోట్ల బడ్జెట్తో డీపీఆర్ తయారు చెయ్యాల్సిందిగా కాంట్రాక్ట్ ఇచ్చారు.. కానీ వాళ్లు పనులు ప్రారంభించలేదు. ఇంతలో 2004 ఎన్నికలు రావటం.. బాబుగారు ఓడిపోవటం జరిగింది. చంద్రబాబు తొలి సారి సీఎం అయినప్పుడు శంకుస్థాపన జరిగిన ప్రాజెక్ట్ మరో సారి ముఖ్యమంత్రిగా గెలిచినా పూర్తి కాలేదు.

పైగా బాబు సీఎంగా చేసిన ఈ 9 సంవత్సరాల పాలనలో ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేసింది కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే. సొంత మామకు వెన్నుపోటు పొడిచి.. టీడీపీ దక్కించుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత వచ్చిన 1996 ఎన్నికల్లో ప్రజల ద్రుష్టిని మరల్చడం కోసం వెలిగొండతో పాటు అనేక ప్రాజెక్ట్ లకి శంఖుస్థాపన చేశాడు.. కానీ అవన్ని రాళ్ల వరకే పరిమితం అయ్యాయి.

వైయసార్ చిత్తశుద్ధితో కదిలిన వెలిగొండ..

చంద్రబాబు హయాంలో ప్రారంభమై.. 9 ఏళ్ల పాటు ఎలాంటి పురోగతి లేని వెలిగొండ ప్రాజెక్ట్.. వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక.. ముందుకు సాగింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. 2005లో వైఎస్సార్ గొట్టిపడియ దగ్గర మరోసారి వెలిగొండ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేసి నిధులు విడుదల చేశారు. అదే సమయంలో జనాల అభ్యర్థన మేరకు ప్రాజెక్ట్ పేరుని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ గా మార్చారు. మొదట 1996లో 980 కోట్ల అంచనాతో ఉన్న ప్రాజెక్టు 2005 నాటికి 5,500 కోట్లకు చేరింది.

2005 నుంచి 2009 వరకు రిజర్వాయర్, కాలువలు, పైపులైన్ల నిర్మాణ పనులు చేసుకుంటూ వచ్చారు. అయితే 2009 సెప్టెంబర్‌ 2న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందడంతో.. మరోసారి ప్రాజెక్ట్ పనులకు గ్రహణం పట్టినట్లైంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు మరోసారి అధికారం చేపట్టే నాటికి ప్రాజెక్టు పనుల్లో 63 శాతం పూర్తయ్యాయి.

కాని నీటిని నది నుంచి అడవిని దాటించి మైదానానికి తీసుకు రావలసిన సొరంగాల పనులు పూర్తి కాలేదు. బాబు అధికారం చేపట్టేనాటికి ఒకటవ సొరంగం 7.214 కిలోమీటర్లు మిగిలిపోయి ఉండగా, రెండవ సొరంగం దాదాపు 10.05 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది.  వీటిని తవ్వడానికి 2006లో జర్మని నుంచి మిషనరీ తెప్పించారు. కానీ అవి తరచుగా సతాయించేవి. వాటిని బాగు చేయడానికి నెలల సమయం పట్టడమే కాక ప్రతి సారి జర్మనీ నుంచి ఇంజనీర్లు రావాల్సి వచ్చేది. పైగా మిషన్లను అడవిలోకి చేర్చడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.

Veligonda project

ధనార్జన కోసం వెలిగొండ ప్రాజెక్ట్ ను వాడుకున్న బాబు..

2014లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులు ఏడాదిలోపు పూర్తి చేసి నీరందిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు చంద్రబాబు. ఎప్పటిలానే ప్రకటనలకే పరిమితం అయ్యారు. అంతేకాక అధికారంలో ఉన్నన్ని రోజులు.. వెలిగొండ ప్రాజెక్ట్ ను తన ధనార్జనకు వాడుకున్నారు.

దీనిలో భాగంగా రెండో టన్నెల్‌ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి.. ప్రాజెక్ట్ అంచనాలు విపరీతంగా పెంచి తన బినామీ, అప్పటి టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ సంస్థకు అప్పగించారు. పైగా ధరల సర్దుబాటు అంటూ జీఓ ఇచ్చి కాంట్రాక్టర్లకు ఉత్తినే 650 కోట్లకు పైగా దోచిపెట్టాడు చంద్రబాబు. టీబీఎంల మరమ్మతుల కోసం మరో 66.44 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి.. కమీషన్లు దండుకున్నారు చంద్రబాబు.

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మొదటి సొరంగం తవ్వింది అక్షరాల 4.331 కి.మీ అనగా రోజుకు సగటున 2.41 మీటర్ల మేర మాత్రమే. ఇక రెండవ సొరంగం దాదాపు 7.5 కి.మీ కాగా.. దాన్ని కూడా 2.355 కి.మీ అనగా సగటున రోజుకు 1.31 మీటర్లు మాత్రమే తవ్వారు. ఈ కాస్త తవ్విందానికే టీడీపీ నేతలు, పచ్చ మీడియా చంద్రబాబే ప్రాజెక్ట్ లో 70 శాతం పూర్తి చేశారంటూ అబద్దాలు ప్రచారం చేసుకుంటున్నారు.

Veligonda project

సీఎం జగన్ కృషితో ముగింపుకు చేరుకున్న వెలిగొండ..

ఇక సీఎం గా జగన్ గారు అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కరోనా పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయలేదు. సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీ. పనులను 2019, నవంబర్‌లో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. అంతేకాక రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు భారీగా పెంచి.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు.

అధికారంలో వచ్చిన తర్వాత సీఎం జగన్‌.. వాటికి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి టీడీపీ సర్కార్‌ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్ల తక్కువకు పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ సొరంగం పనులు అప్పగించారు. రెండో సొరంగంలో ఇప్పటికే 18.465 కిమీల తవ్వకం పూర్తైంది. 2022–23లో 5.52 కి.మీల పొడవున సొరంగం తవ్వి.. ప్రాజెక్టు చరిత్రలోనే రికార్డు సృష్టించారు. ఇక మిగిలింది 335 మీటర్లు మాత్రమే. ఇది కూడా డిసెంబర్ లోగా పూర్తి అవ్వడానికి సిద్దంగా ఉంది. అంటే సగటున రోజుకు 4.30 మీటర్లు తవ్వారు.

తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్‌తో అనుసంధానం చేస్తూ 150 మీటర్ల పొడవున సొరంగం పనులను ఇటీవలే పూర్తిచేసిన జగన్ ప్రభుత్వం.. హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణ పనులకూ శ్రీకారం చుట్టింది. యుద్ధప్రాతిపదికన తొలిదశ పనులను పూర్తిచేసి.. ఈ ఏడాది చివరకు నల్లమలసాగర్‌కు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలించే దిశగా సీఎం జగన్ సర్కార్ వడివడిగా అడుగులేస్తుంది.

వెలిగొండ ప్రాజెక్ట్కు సంబంధించిన వాస్తవాలు ఇలా ఉంటే ప్రాజెక్టు ముగింపు దశకు వచ్చే సరికి టీడీపీ నేతలు మాత్రం అవాస్తవాలు ప్రచారం చేసే పనిలో బిజీగా ఉన్నారు. కానీ ప్రాజెక్ట్ విషయంలో ఎవరేం చేశారన్నది జనాలకు తెలుసుకు కనక..  టీడీపీ నేతల అవాస్తవాలను నమ్మే పరిస్థితుల్లో లేరు.

Veligonda project

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి