iDreamPost

ఇండియా పేరు మార్పుపై ఐక్యరాజ్య సమితి స్పందన.. ఒకవేళ అభ్యర్థన వస్తే..!

  • Author singhj Published - 05:51 PM, Thu - 7 September 23
  • Author singhj Published - 05:51 PM, Thu - 7 September 23
ఇండియా పేరు మార్పుపై ఐక్యరాజ్య సమితి స్పందన.. ఒకవేళ అభ్యర్థన వస్తే..!

ఇప్పుడు ఎక్కడ విన్నా మన దేశం పేరు మార్పు మీదే చర్చ జరుగుతోంది. ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ పేరిట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానాలు రావడంతో దేశం పేరు మీద రాజకీయ వివాదం మొదలైంది. ఈ అంశంపై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ఈ కాంట్రవర్సీ మీద తాజాగా ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. తమ పేర్ల మార్పునకు సంబంధించి దేశాల నుంచి అభ్యర్థనలు వస్తే వాటిని తాము పరిగణిస్తామని ఐరాస తెలిపింది. దేశాల నుంచి వచ్చే విజ్ఞప్తులను స్వీకరించి పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.

‘ఇండియా’ పేరు ‘భారత్​’గా మారనుందా? అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ డిప్యూటీ అధికార ప్రతినిధి పర్హాన్ హక్ స్పందించారు. గత సంవత్సరం టర్కీ దేశం తన పేరును ‘తుర్కియే’గా మార్చుకున్న విషయాన్ని ఆయన ఉదహరించారు. టర్కీ పేరును ‘తుర్కియే’గా మార్చాలనే విషయంలో ఆ దేశ ప్రభుత్వం పంపిన అధికారిక అభ్యర్థనను తాము స్వీకరించి సానుకూలంగా స్పందించామని ఆయన గుర్తుచేశారు. తుర్కియేలాగే ఏ దేశమైనా ఇలాంటి విజ్ఞప్తులు పంపిస్తే వాటిని తాము పరిగణనలోకి తీసుకుంటామని హక్ పేర్కొన్నారు.

దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరగనున్న జీ-20 సదస్సు కోసం రాష్ట్రపతి ముర్ము పంపిన ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించడంతో ఈ కాంట్రవర్సీ మొదలైంది. దీంతో పాటు 20 మంది విదేశీ అతిథులకు పంపిణీ చేయనున్న పుస్తకాల్లోనూ ఇండియాకు బదులుగా భారత్ అని పేర్కొన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీని కూడా ‘ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇక మీదట దేశం పేరు ఇంగ్లీషులోనూ ‘ఇండియా’ ప్లేసులో ‘భారత్​’గా స్థిరీకరించేందుకు మోడీ సర్కారు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. మరి.. ఇండియా, భారత్.. ఈ రెండు పేర్లలో దేశానికి ఏది ఉండాలని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి