iDreamPost

రూ. 300 దర్శనం టిక్కెట్లపై టీటీడీ కీలక ప్రకటన!

రూ. 300 దర్శనం టిక్కెట్లపై టీటీడీ కీలక ప్రకటన!

వేసవి రద్దీ కారణంగా తగ్గించిన 300 రూపాయల ప్రత్యేక దర్శన కోటా టికెట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ కోటా టికెట్లను ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో విడుదల చేస్తామని తెలిపారు. శ్రీవారి ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఆలయంలో తోపులాట లేకుండా మహాద్వారం నుంచి బంగారు వాకిలి వరకు సింగిల్‌ లైన్‌లో భక్తులను అనుమతిస్తున్నాం.

శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటి వరకు 880 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చి ఇప్పటి వరకు 9 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ విరాళాలతో 2500 ఆలయాల నిర్మాణం జరగబోతోంది. ఈ ట్రస్టుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్‌ కూడా రాలేదు. శ్రీవాణి ట్రస్టు ఆలయ నిర్మాణాలు కొంతమంది కాంట్రాక్టర్లకు మాత్రమే ఇస్తున్నామంటూ అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆలయ నిర్మాణాలు నాలుగు విధానాలలో నిర్వహిస్తాం. పార్వేటి మండపాన్ని కూల్చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

జూన్‌ నెలలో 23 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా 116 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 1.6 కోట్ల లడ్లను భక్తులకు అమ్మాము. 23.48 లక్షల మంది అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఘాట్‌ రోడ్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాల కారణంగా వన్య ప్రాణులకు హాని కలుగుతోంది. అందుకే.. చెత్త వేసేందుకు ఆర్టీసీ బస్సుల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేస్తున్నాము’’ అని తెలిపారు.​ మరి, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి