Dharani
Dharani
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పండ్ల తోటలను ప్రోత్సాహించడం కోసం హైదరాబాద్‌లో ఆసిలయాలోనే అతి పెద్ద పండ్ల మార్కెట్ నిర్మణానికి ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోహెడలో సుమారు 403 కోట్ల రూపాయల ఖర్చుతో.. 199 ఎకరాల విస్తీర్ణంలో ఈ పండ్ల మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అధునాతన హంగులు, సకల సౌకర్యాలతో ఈ మార్కెట్‌ను నిర్మించనున్నారు. ఈ క్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి బుధవారం కోహెడ మార్కెట్ నిర్మాణ వ్యయం, ప్రణాళికపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సాహించేందుకు గాను సీఎం కేసీఆర్ ఈ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నారు అని తెలిపారు.
ఈ మార్కెట్‌లో వ్యాపారులు, ట్రేడర్లు, రైతులకు అన్ని రకాల వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ మార్కెట్ నిర్మాణం పూర్తయితే.. ఇది ఆసియాలోనే అతి పెద్ద పండ్ల మార్కెట్‌గా నిలిస్తుందని వెల్లడించారు. ఈ మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వం 403 కోట్ల రూపాయలు కేటాయించడమే కాక 199 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించిందని తెలిపారు. మార్కెట్ నిర్మాణంలో భాగంగా 48.71 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం, కమీషన్ ఏజెంట్లందరికీ దుకాణాలు, 16.50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, 11.76 ఎకరాల్లో పండ్ల ఎగుమతులకై ఎక్స్‌పోర్టు జోన్, 56.54 ఎకరాల్లో రహదారులు, 11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం వంటి నిర్మాణాలు ఏర్పాటు చేస్తామన్నారు.
త్వరలోనే సీఎం కేసీఆర్ ఆమోదంతో మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభింస్తామని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇక నేటి నుంచి రుణమాఫిని పునః ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రైతులు, వ్యవసాయభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎ కేసీఆర్ స్పష్టం చేశారు. లక్ష రూపాయలలోపు పంట రుణాలను మాణీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సెప్టెంబర్ రెండో వారం వరకు రుణమాఫీ కార్యక్రమం సాగనుంది.