iDreamPost

టాలీవుడ్ 2022 – అర్ధసంవత్సరపు రిపోర్ట్

టాలీవుడ్ 2022 – అర్ధసంవత్సరపు రిపోర్ట్

ఈ ఏడాది సగం గడిచిపోయింది. కరోనా తాలూకు చేదు జ్ఞాపకాలన్నీ కనుమరుగైపోతున్న తరుణంలో మళ్ళీ ఫోర్త్ వేవ్ అనే ప్రచారం కొంచెం టెన్షన్ పెడుతున్నప్పటికీ సంవత్సరం క్రితమే కుదుటపడిన బాక్సాఫీస్ ఇంకోసారి ఏదైనా ముంచుకొస్తే తట్టుకోవడం కష్టం. బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు, హిట్లు, డిజాస్టర్లు అన్నీ ఈ ఆరు నెలల కాలంలో చాలానే పలకరించాయి. ఓటిటి ట్రెండ్ లో చాప కింద నీరులా ముంచుకొస్తున్న తరుణంలో ఈ సునామిని తట్టుకోవడం పెద్ద సవాల్ గా మారుతోంది. ఓసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద లుక్కేద్దాం

బ్లాక్ బస్టర్లు

ఇందులో మొదటగా చెప్పుకోవాల్సిన పేరు ఆర్ఆర్ఆర్. ఓటిటిలో వచ్చాక కూడా విదేశీయుల ప్రశంసలు దక్కించుకుంటూనే ఉన్న ఈ విజువల్ వండర్ రాజమౌళి దర్శకత్వ ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. 1100 కోట్లకు పైగా వసూళ్లతో బాహుబలి, దంగల్ ని క్రాస్ చేయనప్పటికీ కంటెంట్ పరంగా చూసుకుంటే దీనికొచ్చిన రీచ్ చాలా గొప్పది. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు ట్రిపుల్ ప్రాఫిట్స్ తో నిర్మాతలను కనక వర్షంలో ముంచెత్తింది.

సూపర్ హిట్లు

మాస్ ని పెద్దగా టార్గెట్ చేసే అవకాశం లేకపోయినా కంటెంట్ లో నిజాయితీ వల్ల మేజర్ సూపర్ హిట్ కొట్టేసి నిర్మాతగా మహేష్ బాబుకి గొప్ప విజయాన్ని అందించింది. నాగార్జున చైతు కాంబోలో వచ్చిన బంగార్రాజు పోటీ లేని అడ్వాంటేజ్ ని వాడుకుని లాభాలు తెచ్చేసుకుంది. సర్కారు వారి పాట మొదటి వారం భారీ పబ్లిసిటీతో కోట్లకు కోట్లు వసూళ్లు వచ్చాయని హోరెత్తించారు కానీ ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ చేరుకోలేదన్నది ట్రేడ్ టాక్. ఎఫ్3, భీమ్లా నాయక్ లు స్ట్రగుల్ అయినప్పటికీ మంచి రెవిన్యూని సాధించాయి

డబ్బింగ్ అద్భుతాలు

ఇండియా వైడ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన కెజిఎఫ్ 2 తెలుగులోనూ కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. బయ్యర్లందరూ డబుల్ మార్జిన్ తో బయటపడ్డారు. విక్రమ్ కేవలం ఏడు కోట్లకు అమ్మితే ఏకంగా పదిహేనుకి పైగా రాబట్టి ఇంకా స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తోంది. జీరో బజ్ తో వచ్చిన శివ కార్తికేయన్ డాన్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. 777 ఛార్లీది సైతం సర్ప్రైజ్ హిట్టే. ఇప్పటికీ ప్రధాన కేంద్రాల్లో దీని రన్ కొనసాగుతోంది. ఈ నాలుగు డబ్బింగ్ మార్కెట్ ని తిరిగి నిలబెట్టాయి

భయపెట్టిన డిజాస్టర్లు

ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా కలలో సైతం నిర్మాతలను వెంటాడిన డిజాస్టర్లలో మొదటగా చెప్పుకోవాల్సింది ఆచార్య గురించే. చిరంజీవి సినిమాకు రెండో రోజే జనం పలుచబడటం దీనికే జరిగింది. రాధే శ్యామ్ తాలూకు గాయాలు దీనికేం తీసిపోలేదు. రవితేజ ఖిలాడీ అడ్రెస్ గల్లంతయ్యింది. ఆడవాళ్ళూ మీకు జోహార్లు అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. గని, శేఖర్ లు కనీసం థియేటర్ రెంట్లు కూడా రాబట్టలేకపోయాయి. అంటే సుందరానికి మంచి టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ చేరుకోలేదు.

చిన్న సినిమాల పెద్ద దెబ్బలు

రీజనబుల్ బిజినెస్ చేసుకుని కాస్తో కూస్తో అంచనాలు రేపిన సినిమాలు టికెట్ కౌంటర్ల దగ్గర చతికిలపడ్డవి చాలా ఉన్నాయి. మొన్న వచ్చిన చోర్ బజార్, సమ్మతమే, మిషన్ ఇంపాజిబుల్, గాడ్సే, సన్ అఫ్ ఇండియా, సెహరి, గుడ్ లక్ సఖి, సూపర్ మచ్చి, 1945, ఇందువదన, సెబాస్టియన్, స్టాండ్ అప్ రాహుల్, భళా తందనాన, జయమ్మ పంచాయితీ, కొండా అన్నీ నష్టాలు తెచ్చినవే. ఉన్నంతలో అశోక వనంలో అర్జున కళ్యాణం ఒకటే బెటర్ అనిపించుకుంది. మిగిలినవన్నీ ఎప్పుడొచ్చాయో కూడా గుర్తులేనంత వేగంగా వెళ్లాయి