iDreamPost

మరో పాక్ ప్రేరేపిత ఉగ్ర దాడి

మరో పాక్ ప్రేరేపిత ఉగ్ర దాడి

ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తుంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. కుప్వారా జిల్లా హంద్వారాలో ఆదివారం తెల్లవారుజామున ఉగ్ర మూకల కాల్పులలో కల్నల్‌ అశుతోష్‌ శర్మతో పాటు,ఒక మేజర్‌, ఒక ఎస్సై,ఇద్దరు సైనికులు వీరమరణం పొందిన ఘటన మరవక ముందే ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు ఒడిగట్టారు.

సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అమరులయ్యారు. కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో క్వాజిబాద్‌ సమీపంలో పెట్రోలింగ్ విధులలో ఉన్న సీఆర్పీఎఫ్‌ సిబ్బంది లక్ష్యంగా సాయుధులైన ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

ముష్కర కాల్పుల నుంచి వెంటనే తేరుకున్న సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఎదురుకాల్పులు ప్రారంభించింది. ఉగ్రవాదుల దాడి గురించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు భారీగా ఆ ప్రాంతానికి చేరుకుని చుట్టుముట్టాయి. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు జరిపిన ఎదురు కాల్పులలో ఒక ఉగ్రవాది హతమైనట్లు అధికారులు తెలిపారు.ఇక ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ఏడుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ లను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. హంద్వారా సెక్టార్‌లో భద్రతా దళాలకు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపారు.

ఈ ఉగ్రవాదుల దాడి ఘటనపై భారత సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణే స్పందిస్తూ జమ్మూ- కాశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపుతూ పాకిస్తాన్‌ తన కుటిల నీతిని ప్రదర్శిస్తూనే ఉందని విమర్శించారు. భారత్‌లోకి ఉగ్రవాదులను ప్రవేశపెట్టడానికి వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని తెలిపాడు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు అందిస్తున్న సహాయం మానుకోకపోతే భారత్ తగిన గుణపాఠం చెబుతుందని ఆయన హెచ్చరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి