iDreamPost

అనుకున్నదే జరుగుతోంది

అనుకున్నదే జరుగుతోంది

థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అయోమయంలో కొన్ని కొత్త సినిమాలు ఓటిటిలో రాబోతున్నాయనే ప్రచారం గత కొద్దిరోజులుగా చూస్తూనే ఉన్నాం. నిర్మాతల సమాఖ్య దీని గురించి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోవైపు దీనికి సంబంధించిన మొదటి అడుగు పడిపోయింది. హాల్ కు రాకుండానే నేరుగా ఆన్ లైన్ లో విడుదల కాబోతున్న స్ట్రెయిట్ మూవీ గా ‘అమృతారామమ్’ నిలవబోతోంది. దీన్ని గత నెల అంటే మార్చ్ 25న థియేట్రికల్ రిలీజ్ కు ప్లాన్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పణ చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు పబ్లిసిటీ చేసి ప్రమోషన్ మొదలుపెట్టి ట్రైలర్ తో పాటు ఆడియోని కూడా విడుదల చేశారు.

అయితే కరోనా లాక్ డౌన్ వల్ల అనూహ్య పరిణామాలు ఏర్పడటంతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రమోట్ చేయడంతో యూత్ నుంచి ఆదరణ దక్కుతుందనే నమ్మకంతో ఉంది యూనిట్. అయితే కనుచూపు మేరలో సానుకూల పరిస్థితి కనిపించకపోవడంతో నేరుగా స్ట్రీమింగ్ యాప్ ద్వారా ప్రేక్షకులకు చూపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29న జీ5 యాప్ ద్వారా దీన్ని చందాదారులు ఉచితంగా ఎక్కడికి కదలకుండా చూసేయవచ్చు. రామ్ మిట్టకంటి, అమితా రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్ కొండట్టి దర్శకుడు. ఎస్ఎన్ రెడ్డి నిర్మాత.

సో అనుకున్నట్టుగానే మెల్లగా చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాలు ఓటిటి దారివైపు మళ్లుతున్నాయని దీన్ని బట్టి అర్థమవుతోంది. రానున్న రోజుల్లో మరికొన్ని కూడా ఇదే బాటలో వెళ్లే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే హీరో, షూట్ ఎట్ సైట్, 100, బూమరాంగ్ లాంటి తమిళ డబ్బింగులు నేరుగా నెట్టింట్లోకి వచ్చేశాయి. ఇప్పుడు అమృతారామమ్ తో స్ట్రెయిట్ మూవీస్ కూడా ఇదే రూట్లో వెళ్తున్నాయి. మరి ఈ మొదటి అడుగు ఇంకెన్నింటికి స్ఫూర్తిగా నిలుస్తుందో వేచి చూడాలి. అగ్ర నిర్మాతలు ఇప్పట్లో దీని గురించి ఏమి చెప్పలేమని ప్రకటించిన కొద్దిగంటల్లోనే ఈ ప్రకటన రావడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి