iDreamPost

రేపో.. మాపో బాబుకు ఆ ముప్పు తప్పేలా లేదు..!

రేపో.. మాపో బాబుకు ఆ ముప్పు తప్పేలా లేదు..!

త్వరలో 12 లేదా 13 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. నిన్న మద్ధాళి గిరి.. నేడు కరణం బలారం.. ఇద్దరూ ఇదే మాట చెబుతున్నారు. కరోనాకు ముందు మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేల పార్టీ వీడడంపై జోరుగా ప్రచారం జరిగింది. అధికార పార్టీ ముఖ్యనేతలే టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరతామని చెబుతున్నారంటూ ప్రకటనలు చేశారు. కరోనా ప్రభావం వల్ల దాదాపు రెండు నెలలుగా అన్ని కార్యకలాపాలతోపాటు రాజకీయం కూడా మందగించింది. కోవిడ్‌ లాక్‌డౌన్‌ నుంచి అన్ని రంగాలకు మెల్లమెల్లగా మినహాయింపులు ఇవ్వడంతో రాజకీయ కార్యకలాపాలు కూడా వేగం పుంజుకుంటున్నాయి. టీడీపీని వీడిన ఇద్దరు ఎమ్మెల్యేలు మద్ధాళి గిరి, కరణం బలరాంలు తమ సహచర ఎమ్మెల్యేలు పార్టీ మారుతారంటూ చేసిన ప్రకటనతో ఈ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది.

గత నెలలో టీడీపీ మహానాడు ప్రారంభానికి ముందు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతారంటూ మీడియాలో విస్తృత ప్రచారం సాగింది. ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్‌లు టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే చర్చ సాగింది. అయితే బాబు మంతనాలతో వారిద్దరు కొద్దిగా మొత్తబడ్డారనే వార్తలొచ్చాయి. అయితే ఇది తాత్కాలికమేననే భావన ఉంది.

2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజం పాలైనప్పటి నుంచి ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలో మెజారిటీ శాతం పార్టీ మారేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటామనే నిబంధనను వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ పెట్టుకోవడంతో వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ సమాలోచనలు జరుగుతుండగానే కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు నగర పశ్చిమ ఎమ్మెల్యే మద్ధాళి గిరి, ఇటీవల ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు. వైసీపీ కండువా కప్పుకోకపోయినా.. వారు టీడీపీని వీడినట్లు ప్రకటించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో వల్లభనేని వంశీ, మద్ధాళి గిరిలు అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం వైపుకాకుండా వేరుగా కూర్చుకున్నారు. ఈ నెలలో జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో వారిద్దరి సరసన కరణం బలరాం కూడా చేరనున్నారు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడడంపై మద్ధాళి గిరి, కరణం బలరాంలు వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 12 లేదా 13 మంది అంటే.. ప్రస్తుతం పార్టీ వీడిన వారితో కలుపుకుంటే.. మొత్తం 16 మంది అవుతారు. నిబంధనల ప్రకారం ఓ పార్టీ తరఫున గెలిచిన వారిలో 3/2 వంతు సభ్యులు ఆ పార్టీని వీడితే వారిపై చట్ట ప్రకారం అనర్హత వేటు పడదు. వారి విజ్ఞప్తి మేరకు స్పీకర్‌ వారందరినీ ప్రత్యేక గ్రూపుగా పరిగణిస్తారు. లేదా వారు కోరుకున్న పార్టీలో విలీనం చేస్తారు. అందుకే తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడలేదు. ఏపీలో పార్టీ విప్‌ ధిక్కరించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేయాలంటూ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ.. తెలంగాణలో మాత్రం ఏమీ చేయలేకపోవడానికి కారణం.. 3/2 వంతు కన్నా ఎక్కువ మంది సభ్యులు పార్టీ ఫిరాయించడమే.

మద్ధాళి గిరి, కరణం బలరాంలు చెబుతున్నట్లు 12 లేదా 13 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడితే.. మొత్తం సంఖ్య 16కు చేరుకుంటుంది. గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లు గెలుచుకుంది. 23 మందిలో 16 మంది అంటే.. మూడింట రెండొంతుల (3/2) సభ్యులు వీడినట్లే. అప్పుడు వీరి విజ్ఞప్తి మేరకు అసెంబ్లీ స్పీకర్‌ వీరందరినీ ప్రత్యేక వర్గంగా పరిగణిస్తారు. ఫలితంగా వారికి ఫిరాయింపుచట్టం వర్తించదు.

రాబోయే రోజుల్లో టీడీపీని వీడే ఎమ్మెల్యేల సంఖ్య 16 దాటిందంటే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదాకు ముప్పు వాటిళ్లినట్లే. శాసనసభ స్థానాల్లో కనీసం 10 శాతం సీట్లు ఉంటేనే సదరు పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఏపీలో 175 సీట్లుకుగాను ప్రతిపక్ష హోదా కోసం కనీసం 18 సీట్లు అవసరం. ప్రస్తుతం టీడీపీకి ఉన్న 23 మందిలో 16 మంది పార్టీని వీడితే ఇక ఏడుగురే మిగులుతారు. అప్పుడు ఎవరి ప్రమేయం లేకుండానే చంద్రబాబు ప్రతిపక్ష హోదా కోల్పోతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి