iDreamPost

ఆ చిరునవ్వుకు సాటేది – Nostalgia

ఆ చిరునవ్వుకు సాటేది – Nostalgia

ఫ్యాక్షన్ సినిమాలు తెలుగులో ఎన్ని వచ్చినప్పటికీ వాస్తవికత విషయంలో కృష్ణవంశీ తీసిన అంతఃపురం అన్నింటి కన్నా ముందుంటుంది. అసలు హీరోనే లేకుండా ఫిమేల్ ఓరియెంటెడ్ గా దీన్ని మలచిన తీరు అద్భుతం. ప్రీ క్లైమాక్స్ కు ముందు వచ్చే జగపతి బాబు పాత్ర మినహా ఇంకే మేల్ డామినేషన్ హీరో యాంగిల్ లో క్యారెక్టర్ పరంగా ఎక్కడా కనిపించదు. అంత సహజ రీతిలో సహజనటి సౌందర్య తన రోల్ కి ప్రాణ ప్రతిష్ట చేశారు. 1998లో వచ్చిన అంతఃపురం కమర్షియల్ గానూ అంతే గొప్ప విజయం సాధించడం ప్రేక్షకుల అభిరుచికి అద్దం పడుతుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి రెండు పాత్రలు.

ఒకటి సీమ నాయకుడు నరసింహులుగా జీవించిన ప్రకాష్ రాజ్. రెండు భానుమతి గా తనను తప్ప ఇంకెవరిని ఊహించలేనంత గొప్పగా చేసిన సౌందర్య. మామ కోడళ్ల మధ్య సహజంగా ఉండాల్సిన అనుబంధానికి పూర్తి వ్యతిరేకంగా డిఫెరెంట్ టోన్ లో సెట్ చేసిన కృష్ణవంశీ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. పైన స్టిల్ చూశారుగా. చూపులతోనే భయపెట్టే నరసింహులు తన మీసాన్ని తీసి భానుమతికి పెడితే ఇద్దరూ మనసారా నవ్వుకుంటూ ఉండగా మధ్యలో బాక్స్ ఆఫీస్ దగ్గర జరగబోయే అద్భుతాన్ని ముందుగానే ఊహించుకున్న కృష్ణవంశీ ముసిముసి నవ్వులను కూడా ఇందులో గమనించవచ్చు.

శారద, సాయి కుమార్, బాబు మోహన్, ఎంఎస్ నారాయణ, అశోక్ కుమార్, తెలంగాణ శకుంతల లాంటి సీనియర్లు ఎందరు ఉన్నా ఈ ఇద్దరిదే అంతఃపురం షో అయిపోయింది. ఈ సినిమా విడుదలైన 6 ఏళ్ళ తర్వాత అతి చిన్న వయసులోనే సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో కన్ను మూయడం విషాదం. తెలుగు, తమిళ, కన్నడలోని అందరూ అగ్ర హీరోలతో పాటు హిందీలో అమితాబ్ బచ్చన్ సరసన నటించిన ఘనత ఒక్క సౌందర్యకే దక్కింది. ఒకవేళ ఇప్పుడు బ్రతికేఉంటే ఆవిడ రూపంలో ఒక గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందుబాటులో ఉండేవారు. సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి తరహా పాత్రలకు సౌందర్యనే బెస్ట్ ఆప్షన్ గా నిలిచేవారు. సినిమా ప్రేమికులకు అలాంటి ఆశలు నెరవేరకుండానే త్వరగానే ఈ లోకం వదిలివెళ్లిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి