Flower Seller's Son Bought iPhone: పూలు అమ్మే తల్లితో బలవంతంగా ఐఫోన్ కొనిపించుకున్న కొడుకు

పూలు అమ్మే తల్లితో బలవంతంగా ఐఫోన్ కొనిపించుకున్న కొడుకు

Flower Seller Forced To Buy iPhone For Her Son: చిన్న పిల్లలు మారాం చేశారంటే ఒక అర్థముంది. కానీ అన్నీ తెలిసిన పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర పేచీ పెడితే ఎలా? ఓ కుర్రాడు ఐఫోన్ కోసం తన తల్లిని ఎంతగా ఇబ్బంది పెట్టాడో.. ఆ తల్లి పరిస్థితి తెలిస్తే బాధపడతారు.

Flower Seller Forced To Buy iPhone For Her Son: చిన్న పిల్లలు మారాం చేశారంటే ఒక అర్థముంది. కానీ అన్నీ తెలిసిన పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర పేచీ పెడితే ఎలా? ఓ కుర్రాడు ఐఫోన్ కోసం తన తల్లిని ఎంతగా ఇబ్బంది పెట్టాడో.. ఆ తల్లి పరిస్థితి తెలిస్తే బాధపడతారు.

చిన్న పిల్లలు చూసిందల్లా కొనమని మారాం చేస్తుంటారు. కొంతమంది తల్లిదండ్రులు స్థోమత ఉంటే కొంటారు. మరికొంతమంది మనకి అంత స్థోమత లేదు నాన్న అని నచ్చజెప్తారు. కొంతమంది ఎంత వరకూ గారం చేయాలో అంతవరకే చేస్తారు. చిన్న పిల్లలకి అంటే తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి తెలియదు కాబట్టి కొనమని మారాం చేస్తారు. కానీ ఎదిగిన పిల్లలు కూడా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించకుండా చూసిందల్లా కొనమని పట్టుపడుతుంటారు. ఫోన్ కొనివ్వమనో, ట్యాబ్ కొనివ్వమనో లేక ల్యాప్ టాపో, బండో ఇలా తమకు నచ్చిన వస్తువులని కొనివ్వమని పేచీ పెడుతుంటారు. అడిగిన వెంటనే కొనేయాలి. లేదంటే అలుగుతారు. అలిగి అన్నం తినడం మానేస్తారు. కొనేవరకూ పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టమని మంగమ్మ శపథం చేస్తారు. తల్లిదండ్రులు తమ రక్తం అమ్మి అన్నం పెడుతుంటే పిల్లలు అన్నం మీదే అలుగుతున్నారు. మొత్తానికి తల్లిదండ్రులు దిగొచ్చి పిల్లల కోరికను నెరవేరుస్తారు.

ఈ క్రమంలో తల్లిదండ్రులు ఎంత నలిగిపోయినా ఆ పిల్లలకు అనవసరం. తమ సంతోషమే ముఖ్యం. ఇలా తల్లిదండ్రులను ఏడిపించి కొనిపించుకునే పిల్లలు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. తమ ఆర్థిక పరిస్థితి బాలేదని ఇంకా తల్లిదండ్రులకు సపోర్ట్ గా నిలబడాలి. కానీ ఫోన్ కొను, ల్యాప్ టాప్ కొను అని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. కానీ ఒక కుర్రాడు మాత్రం అన్నం మీద అలిగి మరీ తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. అమ్మ పూలు అమ్ముతుంది. ఒక గుడి బయట పూల బండి మీద పూలు అమ్మి ఆ వచ్చిన డబ్బుతోనే కొడుకుని పోషిస్తుంది. అలాంటి తల్లికి కాస్త అండగా ఉండాల్సిన కొడుకు మరింత భారంగా మారాడు. తనకు ఐఫోన్ కొనివ్వాలంటూ ఆ తల్లిని అడిగాడు. దానికి ఆ తల్లి మన పరిస్థితి తెలిసే అడుగుతున్నావా? కుదరదు అని చెప్పింది. దీంతో ఆ కుర్రాడు మూడు రోజులు తిండి మానేశాడు. నీళ్లు కూడా తాగలేదు. దీంతో కొడుకు ఏమైపోతాడో అని భయపడి అప్పు చేసి ఐఫోన్ కొనుక్కునేందుకు డబ్బులు ఇచ్చింది.

ఆ కుర్రాడు ఆ డబ్బులతో ఐఫోన్ స్టోర్ కి వెళ్ళాడు. ఆ కుర్రాడిని ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేయడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఆ యూట్యూబర్ కుర్రాడి తల్లిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఆ వీడియోలో ఆమె అప్పు చేసినందుకు ఎంతగా బాధపడుతున్నారో స్పష్టంగా కనబడుతుంది. కుర్రాడి చదువు కోసమో, ఉద్యోగం కోసమో, భవిష్యత్తు కోసమో అప్పు చేస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ సరదా కోసం, జల్సాల కోసం అప్పు చేయడం అంటే పెద్దవాళ్ళకి అది మోయలేని భారం అవుతుంది. పోనీ ఐఫోన్ ఏమైనా 5 వేలకి, 10 వేలకి వచ్చేదా? 60 వేలు, 70 వేలు పెడితేనే గానీ రాదు. ఒకేసారి అంత డబ్బు ఖర్చు చేయడం అంటే పేదవాళ్ళకి గుండె ఆగినంత పనవుతుంది. కాగా ఈ వీడియోపై నెటిజన్స్ యూట్యూబర్ మీద, కుర్రాడి మీద సీరియస్ అవుతున్నారు.

ఆ అమ్మ అంత కష్టపడి పూలు అమ్మి తిండి పెడుతుంటే.. అన్నం తినడం మానేసి ఐఫోన్ కొనిపించుకుంటావా అంటూ తిట్టిపోస్తున్నారు. ఈ నిరాహార దీక్షలు పనికొచ్చే పనుల కోసం చేయాలి గానీ ఫోన్ల కోసమో, సరదాల కోసమో చేయడం ఏంటని మండిపడుతున్నారు. చదువు కోసమో, జాబ్ కోసమో, కోచింగ్ కోసమో ఇలా జీవితంలో పైకొచ్చే వాటి కోసం దీక్ష చేసి సాధించుకున్నా పర్లేదు. సరదా కోసం తల్లి దగ్గర పంతం నెగ్గించుకోవడం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. అలానే ఈ వీడియో తీసి పబ్లిక్ కి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావ్ అంటూ యూట్యూబర్ మీద మండిపడుతున్నారు. మిగతా పిల్లలు కూడా పేరెంట్స్ ని ఇబ్బందులు పెట్టి కొనిపించుకోవాలా అంటూ సీరియస్ అవుతున్నారు. మరి పూలు అమ్మితేనే గానీ పూట గడవని పరిస్థితిలో ఉన్న తల్లిని ఇబ్బంది పెట్టి మరీ కొడుకు ఐఫోన్ కొనిపించుకోవడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. 

Show comments