iDreamPost
android-app
ios-app

ప్రతి సినిమా ఒక పాఠం నేర్పింది.. డైరెక్టర్ రాజమౌళి ఎమోషనల్ ట్వీట్!

  • Author singhj Updated - 09:31 PM, Thu - 27 July 23
  • Author singhj Updated - 09:31 PM, Thu - 27 July 23
ప్రతి సినిమా ఒక పాఠం నేర్పింది.. డైరెక్టర్ రాజమౌళి ఎమోషనల్ ట్వీట్!

తెలుగు సినిమా గతిని మార్చిన వారిలో ముందు వరుసలో ఉంటారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయనకు ముందు ఎంతో మంది దిగ్దర్శకులు ఎన్నో గొప్ప చిత్రాలు తీసి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. అయితే జక్కన్న మాత్రం టాలీవుడ్​ ప్రతిష్టను ఏకంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు. ‘మగధీర’, ‘ఈగ’ సినిమాలతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన రాజమౌళి.. ఆ తర్వాత తీసిన ‘బాహుబలి’ సిరీస్​తో భారతీయ సినిమాలో అగ్ర దర్శకుల జాబితాలోకి చేరిపోయారు. ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా మార్కెట్​ను నేషనల్​ వైడ్​గా ఓపెన్ చేశారాయన.

పాన్ ఇండియా ట్రెండ్​ను క్రియేట్ చేసింది రాజమౌళినే. కంటెంట్ బాగుంటే భాషలతో సంబంధం లేకుండా ఆడియెన్స్​కు మూవీస్ రీచ్ అవుతాయని ఆయన ప్రూవ్ చేశారు. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ప్రాంతీయ భాషా సినిమా దర్శకులు తమ చిత్రాలను పాన్ ఇండియా రేంజ్​లో బహు భాషల్లో విడుదల చేయడం ప్రారంభించారు. ‘బాహుబలి’ సిరీస్​తో జాతీయవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి.. ఆ తర్వాత తీసిన ‘ఆర్ఆర్ఆర్’తో ఇంటర్నేషనల్ ఆడియెన్స్​ను కూడా మెప్పించారు. ఈ సినిమా కలెక్షన్ల మోతను మోగించడమే కాకుండా అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఇందులోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్​ బాబుతో తెరకెక్కించాల్సిన చిత్రం పనుల్లో రాజమౌళి బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమాను హాలీవుడ్ లెవల్లో అత్యంత భారీ బడ్జెట్​తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అలాంటి జక్కన్న సినిమాలతో తనకు ఉన్న బంధాన్ని మరోమారు పంచుకున్నారు. హైదరాబాద్​లోని ప్రముఖ మల్టీప్లెక్స్ అయిన ప్రసాద్ ఐమాక్స్ స్థాపించి 20 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా జక్కన్న ఒక వీడియోను షేర్ చేస్తూ తెలుగు సినిమాలపై, ఆ థియేటర్​పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఎన్నో శుక్రవారాలు, మరెన్నో ఫస్ట్ డే ఫస్ట్ షోలు, ఉదయాన్నే 8.45 గంటలకు సీట్లో కూర్చోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్లే వాళ్లమని రాజమౌళి ట్వీట్ చేశారు. అప్పుడే 20 ఏళ్లు గడిచాయా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతి మూవీ వినోదాత్మకంగా ఉన్నా, నిరాశపరిచినా తనకు ఏదో ఒక రూపంలో గుణపాఠం నేర్పించిందని ఆ ట్వీట్​లో రాజమౌళి రాసుకొచ్చారు. ప్రసాద్ ఐమాక్స్ ఒక థియేటర్ మాత్రమే కాదని.. అది తనకు ఒక తరగతి గది అని జక్కన్న చెప్పుకొచ్చారు. ప్రసాద్ ఐమాక్స్​కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు ఒక వీడియోను ఆయన షేర్ చేశారు. అందులో ఆడియెన్స్ భావోద్వేగాలను చక్కగా ప్రస్తావించారు జక్కన్న. ప్రసాద్ ఐమాక్స్​తో మీకున్న అనుభవాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.