iDreamPost
android-app
ios-app

జయసుధపై మోహన్ బాబు సీరియస్.. ఆమె ఫోన్ లాక్కొని..

జయసుధపై మోహన్ బాబు సీరియస్.. ఆమె ఫోన్ లాక్కొని..

తెలుగు సినీ ఇండస్ట్రీకి బంగారు బాటలు వేసిన గొప్ప నటుల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు. కృష్ణా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఆయన.. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తనువు చాలించేంత వరకు సినిమాలే ప్రపంచంగా బతికారు. ఈ నెల 20వ తేదీకి ఆయన 100వ జయంతిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆ శక పురుషుడికి శత జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు కుటుంబ సభ్యులు. అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన ఏఎన్నార్ విగ్రహాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సీనియర్, జూనియర్ నటులు కదలి వచ్చారు.

జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్, మోహన్ బాబు, రామ్ చరణ్, నాని, విష్ణు, బ్రహ్మనందం, జయసుధ, సుమ వంటి వారు హాజరయ్యారు. అలాగే అక్కినేని కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే జయసుధ మీద మోహన్ బాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు, జయసుధ పక్క పక్క సీట్లలో కూర్చున్నారు. ఆ ప్రక్కన బ్రహ్మనందం కూడా ఉన్నారు. ఏఎన్నార్ గురించి అతిధులు ఓ వైపు మాట్లాడుతూ ఉంటే.. జయసుధ ఫోనును చూస్తూ ఉన్నారు. అంతలో మోహన్ బాబు గమనించి.. జయసుధ చేతిలో ఉన్న ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించారు. అంతలో ఆమెకు ఏదో చెప్పారు. సాధారణంగా క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న ఆయన..  తోటి నటి పట్ల ఇలా ప్రవర్తించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ.. ఏఎన్నార్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘తిరుపతిలో చదువుకునే రోజుల్లో నాగేశ్వరరావు సినిమాల కోసం చొక్కాలు చించుకునే వాళ్లం. మళ్లీ ఆ చొక్కాలు కుట్టించుకునే డబ్బులు కూడా ఉండేవి కాదు.. అలాంటి ఏఎన్నార్‌తో పని చేశాను. ఎస్వీ రంగారావు, ఏఎన్నార్ నటించిన మరపురాని మనిషికి అసోసియేట్‌గా పని చేశాను. అక్కినేని నాగేశ్వరరావు సొంత బ్యానర్‌లో ఎన్నో సినిమాల్లో నటించాను. అన్నపూర్ణమ్మ(ఏఎన్నార్ సతీమణి) అయితే నాతో ఎంతో అప్యాయతతో మాట్లాడేవారు.. ఫలానా చిత్రంలో బాగా నటించావ్ అని అన్నపూర్ణమ్మ గారు అంటే.. వాడికి అసలే పొగరు.. నువ్వు అలా పొగిడితే వాడు ఆగుతాడా? అని ఏఎన్నార్ అన్నారు’ అంటూ ఇలా తన బంధాన్ని గుర్తు చేసుకున్నాడు.