iDreamPost
android-app
ios-app

యువకుడి జీవితంతో ఆటాడుకున్న తపాలాశాఖ.. చేజారిన ఉద్యోగావకాశం

  • Published Oct 09, 2024 | 11:10 AM Updated Updated Oct 09, 2024 | 11:59 AM

Postal department: ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. తీరా జాబ్ పొందే అవకాశం వస్తే తపాలాశాఖ నిర్లక్ష్యంతో యువకుడికి నిరాశ మిగిలింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

Postal department: ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. తీరా జాబ్ పొందే అవకాశం వస్తే తపాలాశాఖ నిర్లక్ష్యంతో యువకుడికి నిరాశ మిగిలింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

యువకుడి జీవితంతో ఆటాడుకున్న తపాలాశాఖ.. చేజారిన ఉద్యోగావకాశం

టైమ్ ఎంతో అమూల్యమైనది. డబ్బు కన్నా విలువైనది కాలం. గడిచిన కాలం తిరిగి రాదు. అందుకే సమయాన్ని వృథా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తుంటారు. నిమిషంలో చేజారే అవకాశాలు జీవితకాలం బాధిస్తుంటాయి. ఇలాగే ఓ యువకుడికి సకాలంలో ఇంటర్వ్యూకి హాజరుకాలేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగావకాశం చేజారిపోయింది. అయితే ఇందులో ఆ యువకుడి తప్పేమీ లేదు. నిర్లక్ష్యం అంతా తపాలాశాఖది. తపాలాశాఖ మొద్దు నిద్రతో యువకుడు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో కలలుకన్నాడు. ఎంతో శ్రమించాడు. ఉద్యోగం వస్తే తమ బ్రతుకులు బాగుపడతాయని భావించాడు. మొక్కవోని దీక్షతో ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు.

ఆ ప్రయత్నంలో అతనికి ఉద్యోగం దక్కించుకునే అవకాశం వచ్చింది. కానీ, చివరకు తపాలాశాఖ నిర్లక్ష్యంతో ఉద్యోగం చేజారిపోయింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. జడ్చర్ల మండలం గంగాపూర్ కు చెందిన బి. నాగరాజు అనే యువకుడు బీఎస్సీ చదివాడు. అనంతరం స్థానిక పోలేపల్లిలోని ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఓ వైపు పనిచేస్తూనే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈక్రమంలో 2023లో నాగరాజు తెలంగాణ విద్యుత్ రెగ్యూలేటరీ కమిషన్ లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి అప్లై చేసుకున్నాడు. మెరిట్ మార్కులు, జోనల్ లో ఎస్సీ కోటాలో ఒకే ఉద్యోగం ఉండటంతో ఇంటర్వ్యూకు అర్హత సాధించాడు.

2024 సెప్టెంబర్27న మధ్యాహ్నం 2 గంటలకు ఒరిజినల్ దృవ పత్రాలతో హైదరాబాద్ లోని కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని అధికారులు సెప్టెంబర్ 4న అభ్యర్థికి స్పీడ్ పోస్ట్ ద్వారా లేఖ పంపారు. ఇంటర్వ్యూ సమయానికి హాజరుకాకపోయినా, డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోయినా ఉద్యోగానికి అర్హత ఉండదని లేఖలో పేర్కొన్నారు. ఇక్కడే నాగరాజును దురదృష్టం వెంటాడింది. తపాలాశాఖ ద్వారా పంపిన లేఖ ఇంటర్వ్యూ గడువు ముగిసిన తర్వాత అక్టోబర్ 4న అభ్యర్థి నాగరాజుకు అందింది. ఆయన అధికారులను సంప్రదించగా ఇంటర్వ్యూకు హాజరుకాకపోవడంతో మరొకరికి ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు. దీంతో నాగరాజు తీవ్ర నిరాశకు గురయ్యాడు.

నోటికాడికొచ్చిన ముద్ద చేజారిపోవడంతో బాధపడ్డాడు. వెంటనే బాధితుడు తన బంధువులు స్నేహితులతో కలిసి వెళ్లి జడ్చర్లలోని తపాలాశాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ ను ప్రశ్నించారు. దీనిపై అసిస్టెంట్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. గంగాపూర్ గ్రామంలో ఉత్తరాలు పంపిణీ చేసే శ్రీకర్ గత నెల 24న ఉద్యోగానికి రాజీనామా చేయడంతో మరో వ్యక్తి సర్దార్ కు ఆ బాధ్యత అప్పగించామన్నారు. అయితే సెప్టెంబర్ 18న లేఖ అందించినట్లు సిబ్బంది చెబుతున్నా అందులో నిజం లేదని వెల్లడైందని తెలిపారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తలుపు తట్టిన అదృష్టం కాస్త తపాలాశాఖ నిర్లక్ష్యంతో దురదృష్టంగా మారడంతో నాగరాజు మనస్థాపానికి గురయ్యాడు. టెక్నాలజీ అభివృద్ది చెందింది. అధికారులు స్పీడ్ పోస్టు ద్వారా కాకుండా మెయిల్ ద్వారా అభ్యర్థికి సమాచారం అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి తపాలా శాఖ నిర్లక్ష్యంతో యువకుడు ఉద్యోగావకాశాన్ని కోల్పోయిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.