iDreamPost
android-app
ios-app

TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మహిళల రియాక్షన్ ఇదే!

తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకాన్ని నేడు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహిళి ప్రయాణికులు ఈ పథకంపై ఏమన్నారంటే?

తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకాన్ని నేడు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహిళి ప్రయాణికులు ఈ పథకంపై ఏమన్నారంటే?

TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మహిళల రియాక్షన్ ఇదే!

ఈ రోజు అనగా డిసెంబర్ 9న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజును పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద తెలంగాణలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రేవేశ పెట్టిన మహాలక్ష్మీ పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మహాలక్ష్మీ పథకం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో మహిళాలోకం ఆనందం వ్యక్తం చేస్తుంది. ఈ పథకం నేటి నుంచి అమల్లోకి రావడంతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కలుగ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి మహిళలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ పథకం గురించి మహిళా ప్రయాణికులు స్పందిస్తూ.. తమకు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉందని వెల్లడించారు. ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులకు, ఇతర వృత్తి పనులు చేసుకునే వారికి మహాలక్ష్మీ పథకం అద్భుతమని తెలిపారు.

ఇదివరకు బస్ పాస్ తీసుకుంటే రూ. 13 వందలు ఖర్చు అవుతుండేదని కానీ ఈ పథకం అమల్లోకి రావడంతో ఆ మొత్తం మిగులుతుందని తెలిపారు. పాస్ లేని వారికి నెలవారిగా రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు కిరాయిలకు ఖర్చు అవుతుండేదని వారు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకంతో బస్సు ఛార్జీలకయ్యే ఖర్చు మొత్తం మిగులుతుందని వారు వెల్లడించారు. ఈ మిగిలిన డబ్బుతో తమ కుటుంబ అవసరాలు, పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులకు ఉపయోగకరంగా ఉండనుందని మహిళా ప్రయాణికులు చెప్పుకొచ్చారు. ఈ పథకాన్ని కొనసాగించాలని కోరారు. బస్సు సర్వీసులను తగ్గించి ఇబ్బందులకు గురి చేయొద్దని ప్రభుత్వానికి మహిళలు విన్నవించుకున్నారు. మహిళల ప్రయాణ బాధలను చూసి ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

ఇక మొదటి వారం రోజులు ఏవిధమైన గుర్తింపు కార్డు లేకుండానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతినిచ్చింది. మహాలక్ష్మీ పథకానికి సంబంధించిన విధివిదానాలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. తెలంగాణ జిల్లాల్లో పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది. అదే విధంగా హైదరాబాద్ నగరంలో ఆర్డీనరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ లల్లో ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. అంతే కాకుండా అంతర్ రాష్ట్ర బస్సుల్లో తెలంగాణ పరిధి వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు అని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణకు చెందిన మహిళలు రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైన ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది.