P Krishna
P Krishna
ఈశాన్య బంగాళా ఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. హైదరాబాద్ లో శనివారం నుంచి వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నేటి ఉదయం నుంచి నగరంలో వర్షం దంచికొడుతుంది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కాండంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, చిరు వ్యాపారులు, ఉద్యోగాలకు వెళ్లేవారు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు మూడు రోజుల వరకు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతు అయ్యింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. మరో మూడు రోజుల వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. నగరంలోని గాంధీ నగర్‌లో విషాద ఘటన వెలుగు చూసింది. హుస్సేన్ సాగర్ నాలాలో లక్ష్మీ(55) మహిళ పడి గల్లంతు అయ్యింది. కొంతకాలం క్రితం లక్ష్మీ నాలా పై ఇల్లు నిర్మించుకుంది. ఇటీవల పడ్డ వర్షాల కారణంగా ఇంటి గోడ కూలిపోయింది. ఇంటి వద్ద పగిలిపోయిన గాజులు, చెప్పులు కనిపించడంతో లక్ష్మీ నాలాలో పడి పోయినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గల్లంతు అయిన లక్ష్మీకి ముగ్గురు కుమార్తెలు. వీరి వివాహం జరగడంతో ఇటీవల నాలాపై ఇల్లు నిర్మించుకొని ఒంటరిగా ఉంటుంది. అయితే ఇంటికి ప్రహారీ గోడ లేకపోవడం, ఇటీవల కురిసిన వర్షాలకు గొడలు కూలిపోవడంతో ఆమె తీవ్ర ఇబ్బంది పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె కాలు జారి నాలాలో పడి ఉంటుందని స్థానికులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ నగర్ పోలీసులకు లక్ష్మీ కుమార్తె ఫిర్యాదు చేయగా అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే నగర వాసులకు జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పనులు ఉంటే మాత్రమే బయటకు రావాలని.. లేదంటే ఇంట్లోనే ఉండాలని సూచించింది.