iDreamPost
android-app
ios-app

ఇకపై RTC బస్సు ఎక్కడ ఉందో మీ ఫోన్ నుంచే తెలుసుకోవచ్చు!

  • Author singhj Published - 03:40 PM, Sat - 12 August 23
  • Author singhj Published - 03:40 PM, Sat - 12 August 23
ఇకపై RTC బస్సు ఎక్కడ ఉందో మీ ఫోన్ నుంచే తెలుసుకోవచ్చు!

టీఎస్​ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూపురేఖలు మారిపోయాయి. సంస్థ అభివృద్ధిపై, ప్రజా రవాణాపై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్యాసింజర్లకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడం ద్వారా ఆక్యుపెన్సీని పెంచి, ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రజా రవాణాను మరింత సౌకర్యంగా మార్చేందుకు పలు ప్రయోగాలు కూడా చేస్తున్నారు సజ్జనార్. ఈ క్రమంలోనే కొత్తగా ట్రాకింగ్ సిస్టమ్​ను తీసుకొచ్చారు. టీఎస్​ఆర్టీసీ సరికొత్త బస్ ట్రాకింగ్ యాప్​ ‘గమ్యం’తో ముందుకొచ్చింది. ఆధునిక ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యాప్​ను ఎంజీబీఎస్ బస్టాండ్​లో సజ్జనార్ మొదలుపెట్టారు.

టీఎస్​ఆర్టీసీకి చెందిన రాష్ట్రంలోని 4,170 బస్సులకు ఈ ట్రాకింగ్ సదుపాయాన్ని కల్పించామని సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీలోని పుష్పక్, మెట్రో సర్వీసులకు కూడా ట్రాకింగ్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. అదే విధంగా జిల్లాల్లో నడిచే పల్లె వెలుగు సర్వీసు మినహా అన్ని ఇతర బస్సులకు ఈ సదుపాయాన్ని కల్పించామని సజ్జనార్ పేర్కొన్నారు. ‘గమ్యం’ యాప్​లో కేవలం బస్ ట్రాకింగ్ సదుపాయమే కాకుండా మహిళల భద్రత కోసం కూడా పలు ఫీచర్లను తీర్చిదిద్దామని చెప్పుకొచ్చారు. డయల్ 100, 108కి కూడా ‘గమ్యం’ యాప్​ను అనుసంధానం చేశామని తెలిపారు.

‘గమ్యం’ యాప్ గురించి మాట్లాడిన సజ్జనార్.. ఆర్టీసీ ఉద్యోగుల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంపై సీఎం కేసీఆర్​కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న తమ సిబ్బందికి గుర్తింపు దక్కిందన్నారు. ప్రజా సౌకర్యం కోసం ఎన్నో సంస్కరణలను ఆర్టీసీ తీసుకొచ్చిందన్నారు సజ్జనార్. రాష్ట్రవ్యాప్తంగా రూ.200 కోట్లతో ఎన్నో బస్టాండ్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. బస్సులను ట్రాక్ చేసేందుకు ‘గమ్యం’తో ముందుకు వచ్చామన్నారు. మ్యాప్ మై ఇండియా సహకారంతో ఈ యాప్​ను సక్సెస్​ఫుల్​గా లాంఛ్ చేస్తున్నామని సజ్జనార్ వివరించారు. స్మార్ట్ ఫోన్లు వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలని కోరారు.