P Venkatesh
P Venkatesh
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగలు సమీపిస్తున్న వేళ టీఎస్ ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ ఆఫర్ తో ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనున్నది. తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తమ సొంత ఊరిలో పండుగలను జరుపుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు వెళ్తుంటారు. పండుగ సమయాల్లో రైళ్లు, బస్సులు కిక్కిరిసి పోతుంటాయి. ఈ క్రమంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే టికెట్లపై రాయితీ ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే ప్రయాణికులకు 10 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ తెలిపారు. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. కాగా ఆయా తేదిల్లో ప్రయాణించే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. మరో విషయం ఏంటంటే సెప్టెంబర్ 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని టీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది. కాగా ఈ ఆఫర్ తో ప్రయోజనం పొందాలనుకునే వారు ఈ నెల 30 వరకు ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని సంస్థ వెల్లడించింది. ప్రయాణికులు ముందస్తు టికెట్ల బుకింగ్ కోసం టీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ను సంప్రదించాలని కోరారు.