క్యాన్సర్‌ పేషెంట్లకు గుడ్‌ న్యూస్‌.. ఇక జిల్లా ఆస్పత్రుల్లోనూ చికిత్స

శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. అన్ని రంగాల్లో ఎంతో పురోగతి సాధించాము. కానీ వైద్యం రంగంలో మాత్రం.. కొన్ని సవాళ్లు అలానే ఉండి పోతున్నారు. ఏళ్ల తరబడి.. లక్షల కోట్లు వాటి మీద ప్రయోగాల కోసం ఖర్చు చేసినా.. సంతృప్తికరమైన ఫలితాలు రావడం లేదు. మరీ ముఖ్యంగా కొన్ని వ్యాధులకు నేటికి కూడా సరైన చికిత్స, మందులు అందుబాటులో లేవు. అలాంటి వాటిల్లో క్యాన్సర్‌ ఒకటి. ఒక్కసారి ఈ మహమ్మారి బారిన పడ్డామంటే.. ఇక అంతే సంగతులు. కోలుకోవడం చాలా కష్టం. పైగా చికిత్స కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్నది.

ధనవంతులైతే పర్లేదు.. కానీ పేదలు, మధ్యతరగతి వారి పరిస్థితి వర్ణనాతీతం. వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇక క్యాన్సర్‌ చికిత్స అంటే లక్షల్లో ఖర్చు చేయాలి. కానీ పేద వారు అంత భారీ మొత్తాన్ని భరించలేరు. ఈ క్రమంలో పేదల కోసం తెలంగాణ సర్కార్‌.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా క్యాన్సర్‌ చికిత్స అందిస్తుంది. ఈ క్రమంలో తాజాగా సర్కార్‌ ఓ శుభవార్త చెప్పింది. ఇకపై జిల్లా ఆస్పత్రల్లోనూ క్యాన్సర్‌ చికిత్స అందించనున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు సిద్దిపేట, ఖమ్మం, సిరిసిల్ల, కరీంనగర్‌, వనపర్తి జిల్లా ఆసుపత్రుల్లో క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌, కీమోథెరపీ సేవలను అందిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఒక్కో ఆసుపత్రిలో పదేసి పడకలను ప్రత్యేకంగా క్యాన్సర్‌ రోగులకు కేటాయించి వారికి చికిత్స అందిస్తున్నారు. ఇక మిగిలిన జిల్లాల వారు రేడియేషన్, కీమోథెరపీ కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. అయితే ఇక మీదట వారు అలా నగరానికి వచ్చే అవసరం లేకుడా.. జిల్లా ఆసుపత్రుల్లోనే ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా చికిత్స అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక దీనిలో భాగంగా తొలుత కీమోథెరపీ అందిస్తారు. ఆ తర్వాత ఇతర సేవలనూ విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

గత కొద్ది రోజులుగా చూస్తే.. ప్రధానంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పెరుగుతోంది. చాలా మందికి దీనిపై కనీస అవగాహన లేక.. పట్టించుకోవడం లేదు. దాంతో ఆఖరి దశలో బయట పడుతుంది. ఇక నుంచి ఇలాంటివారికి ఎక్కడికక్కడ చికిత్సలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాస్థాయిలో చికిత్సలు ప్రారంభించడంతోపాటు గ్రామీణ స్థాయిలో కూడా స్క్రీనింగ్‌ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక మొబైల్‌ వెహికల్ ద్వారా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే స్క్రీనింగ్‌లు చేపట్టారు.

క్యాన్సర్ చికిత్సో కోసం సూదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా ఎంఎన్‌జే ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రుల్లోనే.. తొలుత కీమోథెరపీ సేవలందించాలని నిర్ణయించామని ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జయలత తెలిపారు. భవిష్యత్తులో రేడియేషన్‌ సేవలు ప్రారంభించే ఆలోచన కూడా ఉందని చెప్పుకొచ్చారు. ఇ​ రాష్ట్రవ్యాప్తంగా 100-150 మంది వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందికి ఇప్పటికే ఇందుకు సంబంధించి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. చికిత్సలపై ఏదైనా సందేహం ఉంటే వీడియో కాల్‌ ద్వారా నివృత్తి చేస్తున్నామని తెలిపారు.

ఇక హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇటీవలే రూ.35 కోట్లతో రోబో చికిత్సలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎలాంటి క్యాన్సర్‌ కణతులకైనా రోబో సాయంతో చికిత్స చేసేందుకు ఈ ఆసుపత్రిలో అవకాశం ఉంది. వివిధ రకాల రక్త క్యాన్సర్లకు బోన్‌మ్యారో మార్పిడి చేస్తున్నారు. గత ఆరు నెలల్లో 30 మందికి ఈ తరహా చికిత్సలు అందించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు.

Show comments