iDreamPost
android-app
ios-app

స్కూళ్లపై టీఎస్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏం చేయబోతుందో తెలుసా?

స్కూళ్లపై టీఎస్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏం చేయబోతుందో తెలుసా?

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రభుత్వ పాఠశాల్లో సకల సౌలతులు కల్పించి విద్యార్థులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చూస్తున్నది. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కావాల్సిన నిధులను కేటాయించి ఖర్చు చేస్తున్నది. గురుకులాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నది. మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి వంటి కార్యక్రమాలతో స్కూళ్ల స్వరూపాన్నే మార్చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్ల పర్యవేక్షణ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రభుత్వ స్కూళ్ల పర్యవేక్షణపై విద్యా సమీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది.

అన్ని స్కూళ్లను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. త్వరలో ఈ కేంద్రాన్ని ప్రారంభించనుంది. దీనికి ‘విద్యా సమిక్ష కేంద్రం’ అని పేరు పెట్టారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నమోదు, వారి అభ్యసన స్థాయిలు, వ్యక్తిగత, పాఠశాలల వారీగా ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. రూ.5 కోట్ల అంచనా వ్యయంతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ రెండో అంతస్తులో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 20 అడుగుల ఎత్తైన భారీ స్క్రీన్ తో పాటు అత్యాధునిక కంప్యూటర్ వ్యవస్థలను కలిగి ఉన్న ఈ కేంద్రంలో సమాచారాన్ని స్వీకరించడం, పర్యవేక్షించడం జ‌రుగుతుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాఠశాలల పర్యవేక్షణ కోసం సెంట్రలైజ్డ్ డ్యాష్ బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, విద్యార్థులకు యూనిఫాం పంపిణీ వంటి పథకాలను పర్యవేక్షించడానికి, ట్రాక్ చేయడానికి ఇది అధికారులకు ఉపయోగపడుతుంది. అన్ని స్కూళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఒక్క క్లిక్ తో అందుబాటులో ఉండే విధంగా డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులకు ‘విద్యా సమిక్ష కేంద్రం’ తోడ్పడుతుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీసీ కెమెరాల అనుసంధానంతో వీడియో నిఘా కూడా ఉంటుంది.