నేతన్నలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. చేనేత కార్మికులకు ప్రతి నెల రూ. 3వేలు

రాష్ట్రంలో చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రతి నెల వారి ఖాతాల్లో రూ. 3వేలు జమ చేయనున్నది. దీనిలో బాగంగా మొదటిసారిగా చేనేతమిత్ర పథకం కింద అర్హులైన చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రూ.3 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జమ చేసింది. ఎన్నో ఏండ్ల నుంచి చేనేత వృత్తిపై ఆదారపడిన వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో చేతినిండా పని లేక, సరైన ముడి సరుకులు దొరకక, సరైన మార్కెట్ సదుపాయం లేక అనేక ఇబ్బందులకు గురయ్యేవారు చేనేత కార్మికులు. దీంతో పెట్టిన పెట్టుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ మగ్గాలకే ఉరిపోసుకున్న సందర్భాలు కోకొల్లలు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ నేతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఉరిసిల్లను సిరిసిల్లగా మార్చిన ఘనతను దక్కించుకున్నారు.

సీఎం కేసీఆర్ నేతన్నలను ఆదుకోవాలనే లక్ష్యంతో వారికి అవసరమైన నూలు, రంగులు, రసాయనాలకు 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తున్నది. అలాగే నేత కార్మికులకు పించన్, చేనేత బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి చేనేత కార్మికులకు వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 7వ తేదీన మంత్రి కేటీఆర్ నేత కార్మికులకు రూ. 3 వేలు అందించాలని నిర్ణయించినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే జియోట్యాగింగ్ ద్వారా ట్యాగ్ అయిన ప్రతి చేనేత కార్మికునికి సెప్టెంబర్ 1న రూ. 3వేలు వారి ఖాతాలో నేరుగా జమ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జియో ట్యాగింగ్ అయిన 32 వేలకు పైగా చేనేత కార్మికులకు లబ్ధి చేకూరింది. దీంతో చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Show comments