Dharani
Dharani
తన గానంతో అనేక పాటలు పాడి.. ప్రజా సమస్యలపై జనాలకు అవగాహన కల్పించి.. ప్రజా యుద్ధనౌకగా గుర్తింపు పొందిన గద్దర్ ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గద్దర్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గద్దర్ మృతికి సంతాపం ప్రకటించిన కేసీఆర్.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం అల్వాల్ మహాబోధి విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలు జరపాలని కుటుంబసభ్యులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ మీదుగా అల్వాల్ వరకు అంతిమయాత్ర నిర్వహిస్తారు. అంతిమయాత్ర మధ్యలో గద్దర్ పార్థీవదేహాన్ని భూదేవినగర్‌లోని ఆయన నివాసంలో కాసేపు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం గద్దర్ భౌతికకాయాన్ని అభిమానులు సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో ఉంచారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో భౌతికకాయాన్ని ఉంచారు.
ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు గద్దర్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గద్దర్ పార్థివదేహానికి మంత్రులు మహమూద్ అలీ, సత్యవత్ రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. నేడు సీఎం కేసీఆర్ గద్దర్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఏపీ సీఎం జగన్, చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి వంటి వారు గద్దర్ మృతికి సంతాపం తెలిపారు.