iDreamPost
android-app
ios-app

DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కారు!

  • Author singhj Published - 08:03 PM, Fri - 25 August 23
  • Author singhj Published - 08:03 PM, Fri - 25 August 23
DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కారు!

డీఎస్సీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి కేసీఆర్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఎస్​డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టుల్లో 2,575 ఎస్​జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి అనుమతి జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టీఎస్​పీఎస్​సీ ద్వారా కాకుండా డిస్ట్రిక్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)లతో నియామకాలను చేపడతామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో క్వాలిఫై అయిన వారంతా టీఆర్​టీకి పోటీ పడేందుకు అర్హులు. టీఆర్​టీకి అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాల వారీగా జాబితాను రూపొందించి డీఎస్సీకి పంపుతారు. ఆ తర్వాత ఆయా జిల్లాల డిస్ట్రిక్ సెలెక్షన్ కమిటీలు నియామకాలు చేపడతాయి. కాగా, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్​ టెట్ 2023)ను సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ఎగ్జామ్ రిజల్ట్స్​ను అదే నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్​ జారీ అవుతుందని తెలుస్తోంది.

ఇక, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో రీసెంట్​గా కాంట్రాక్ట్ విధానంలో 1,264 బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేజీబీవీల్లో సిబ్బందిని క్రమబద్ధీకరించడం కుదరదని ఆమె తేల్చిచెప్పారు. గురుకులాలకు సంబంధించి 12,150 బోధన, బోధనేతర ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు సబిత. కాగా, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఒప్పంద టీచర్లను క్రమబద్ధీకరణ మీద తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 567 మంది ఒప్పంద టీచర్లను క్రమబద్ధీకరిస్తూ ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.