iDreamPost
android-app
ios-app

పోలీసు కొలువు వీరి కల.. రాత్రింబవళ్లు కష్టపడి చదివారు, కానీ..!

పోలీసు కొలువు వీరి కల.. రాత్రింబవళ్లు కష్టపడి చదివారు, కానీ..!

నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రతీ ఒక్కరు బాగా కష్టపడి చదువుకుని ఎలాగైన ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే కలలు కంటుంటారు. ఇక అదే దృఢనిశ్చయంతో రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తి పడతారు. ఇక పరీక్షల్లో బాగా రాసి ఎలాగైన ఉద్యోగం సాధించి కన్నవారి కోరిక వేర్చాలని జీవితంలో స్థిరపడాలని అనుకుంటుంటారు. అయితే అచ్చం ఇలాగే కలలు కన్న ఓ ఈ ఇద్దరు యువకులు TSLPRB విడుదల చేసిన పోలీసు నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ సారి ఎలాగైన పోలీసు కొలువు సాధించాలని బలంగా అనుకున్నారు. ఇందులో భాగంగానే బాగా చదువుకుని ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో పాసయ్యారు. ఆ తర్వాత నిర్వహించిన ఈవెంట్స్ లోనూ క్వాలిఫై అయ్యారు. కానీ TSLPRB తాజాగా విడుదల చేసిన తుది ఫలితాల్లో మాత్రం విజయం సాధించలేకపోయారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఈ యువకులు ఆత్మహత్య చేసుకుని కన్నవాళ్లకు కడుపుకోతను మిగిల్చి అందనంత దూరాలకు వెళ్లిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటనలు ఇరువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇంతకి ఈ ఘటనలు ఎక్కడ జరిగాయంటే?

పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు సంబంధించిన ఫైనల్ రిజల్ట్ ను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రుట్ మెంట్ బోర్డు (TSLPRB) బుధవారం తుది ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఎంతో మంది యువతి, యువకులు పోలీస్ కొలువులను సాధించారు. అయితే ఈ ఫలితాల్లో ఉద్యోగం రాలేదని మహబూబ్ నగర్ జిల్లాలోని హన్వాడకు చెందిన రమేష్ అనే యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడే కాకుండా ధరూర్ కు చెందిన దేవర్జున్ అనే యువకుడు కూడా పోలీస్ కొలువు సాధించలేక పోయాననే కారణంతో తాజాగా బలవన్మరణానికి పాల్పడి కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోయాడు.

ఇద్దరి యువకులు ఆత్మహత్య చేసుకోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో వీరి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాజంలో బతుకుతున్నవారంతా ప్రభుత్వ ఉద్యోగులేం కాదని, బతికేందుకు బయట ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ కూడా ఉద్యోగం సాధించలేకపోయామని నిరుత్సాహ పడి ఆత్మహత్య చేసుకోకూడదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.