iDreamPost

బీ అలర్ట్: కిలో టమాటా రూ.250 అవుతుంది.. రెడీగా ఉండండి!

  • Author singhj Published - 02:30 PM, Mon - 31 July 23
  • Author singhj Published - 02:30 PM, Mon - 31 July 23
బీ అలర్ట్: కిలో టమాటా రూ.250 అవుతుంది.. రెడీగా ఉండండి!

సామాన్యులను టమాటా ధరలు ఒక రేంజ్​లో భయపెడుతున్నాయి. రోజురోజుకీ టమాటా ధరలు పెరుగుతుండటంతో ప్రజలు వీటిని కొనాలంటే హడలెత్తిపోతున్నారు. ఒకప్పడు కిలో రూ.2కే లభించిన టమాటాలను ఇప్పుడు కొనాలంటేనే జంకుతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో టమాటా ధరలు ఆల్​టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో కేజీ టమాటా ధర రూ.200కి చేరుకోగా.. వారం తర్వాత పరిస్థితులు పూర్తిగా చక్కబడటంతో రూ.140కు లభించాయి. అయితే పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాటి ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. వారం అవ్వకముందే టమాటా ధరలు తిరిగి రూ.200 చేరుకున్నాయి.

ఇంకో వారం రోజుల్లో కిలో టమాటా ధర రూ.250కి చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తుంటాయి టమాటాలు. ఆంధ్రప్రదేశ్​తో పాటు మహారాష్ట్ర నుంచి తెలంగాణ వ్యాపారులు టమాటాలను తెచ్చుకుంటారు. అయితే ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఎడతెరపి లేకుండా వానలు కురుస్తుండటంతో పంట దెబ్బతిని ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో పంజాబ్ నుంచి టమాటాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సుదూరంగా ఉన్న పంజాబ్ లాంటి రాష్ట్రం నుంచి టమాటాలను తీసుకొచ్చేందుకు ఖర్చుల భారం కూడా ఎక్కువైంది.

టమాటాల దిగుమతికి ఎక్కువ ఖర్చు అవుతుండటంతో వినియోగదారులకు అధిక ధరకు అమ్మాల్సి వస్తోందని వ్యాపారులు అంటున్నారు. రేట్లు ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ ప్రజలు టమాటాలను పెద్దగా కొనుగోలు చేయడం లేదని.. ఇతర కూరగాయలను మాత్రమే కొంటున్నారని వ్యాపారులు అందోళన చెందుతున్నారు. టమాటా ధరలకు రెక్కలు రావడంతో ఇంట్లో వీటిని వాడటమే మానేశారు చాలా మంది. రెస్టారెంట్లలోనూ టమాటాలను ఎక్కువగా ఉపయోగించడం లేదని తెలుస్తోంది. దీంతో సేల్స్ తగ్గిపోయాయని, తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి