రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. రూ.2 లక్షల రుణమాఫీ.. ముందు వారికి మాత్రమే

Rythu Runa Mafi: తెలంగాణ సర్కార్‌ రైతు రుణమాఫీ హామీ అమలుకు చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

Rythu Runa Mafi: తెలంగాణ సర్కార్‌ రైతు రుణమాఫీ హామీ అమలుకు చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. మరీ ముఖ్యంగా అన్నదాతలను ఆదుకునేందుకు చెప్పిన రైతు భరోసా, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ హామీల అమలుకు రెడీ అవుతోంది. ఆగస్టు 15 లోగా.. 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోంది. వివిధ బ్యాంకుల నుంచి రైతుల జాబితాను ఇప్పటికే తీసుకుంది. ప్రస్తుతం రుణమాఫీ మొత్తం చెల్లించేందుకు అవసరమైన నగదు సమకూర్చుకునే పనిలో ఉంది. జూలై 1 నుంచి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ హామీ అమలు కానుందని సమాచారం. దీనిపై జూన్‌ 21 అనగా రేపు గురువారం నాడు జరిగే కేబినెట్‌ భేటీలో చర్చించి.. నిర్ణయం తీసుకోనున్నారు.

ఇక జూలై మొదటి వారం నుంచి దశల వారీగా రుణమాఫీ చేస్తారని.. ముందుగా రూ.లక్ష వరకు లోన్‌ తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తింప చేస్తారని.. ఆతర్వత రూ.లక్షన్నర.. ఇక చివరగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని తెలుస్తోంది. మొదటి రెండు దశల్లో సుమారు 16 లక్షల మంది రైతులకు రుణమాఫీ అమలు చేయనున్నారు. రూ.రెండు లక్షల వరకు ఉన్న రైతులకు తర్వాత రెండు దశల్లో అమలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జులై మాసంలో కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆ బడ్జెట్‌లో మిగిలిన రుణ మాఫీ అమలుకు నిధులను సమీకరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అధికారంలోకి రాగానే ముందుగా రైతు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావించింది. కానీ అప్పటికే నిధులు సమీకరణ, బ్యాంకుల నుంచి రైతుల జాబితా తీసుకోవడం వంటి అంశాలు ఆలస్యం అయ్యాయి. ఈలోపు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అది కూడా ముగియడంతో.. రుణమాఫీ అమలుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, మేయర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత కేటగిరీల్లోని ఉద్యోగులు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఇలా వివిధ వర్గాలకు చెందిన వారు.. తమ భూమలపై తీసుకున్న రుణానికి మాఫీ వర్తించబోదని సమాచారం. దీనిపై రేపు సాయంత్రానికి అధికారిక ప్రకటన రానుంది.

Show comments