P Krishna
ప్రతి ఏడాది ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా రూపొందిన శకటాలు ప్రదర్శించబడతాయి.
ప్రతి ఏడాది ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా రూపొందిన శకటాలు ప్రదర్శించబడతాయి.
P Krishna
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏడాది జనవరి 26న నిర్వహించే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు సిద్దమవుతుంటాయి. ఈ క్రమంలో రాబోయే రిపబ్లిక్ డే వేడుకల కోసం ఢిల్లీలోని రక్షణ శాఖకు చెందిన రంగ్ శాల మైదానంలో తుది మెరగులు దిద్దుకుంటోంది. సాధారణంగా రక్షణ శాఖకు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు స్పెషల్ పారా మిలటరీ బలగాలు, ఫోర్సెస్, ఇతర సాయుధ బలగాలు ప్రతియేట పదర్శనలో భాగంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం సైతం కనువిందు చేయబోతుంది. 2020 తర్వాత తెలంగాణ శకటం ప్రదర్శనలో పాల్గొంటోంది. ఈ శకటానికి సంబంధించిన థీమ్ కూడా ఆసక్తకరంగా మారింది. సుమారు మూడేళ్ల తర్వాత తెలంగాణకు ఈ అవకాశం దక్కడం గమనార్హం.
ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ప్రతి ఏటా వివిధ రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన థీమ్ తో శకటాలు ప్రదర్శిస్తారు. దాదాపు మూడేళ్ళ తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా తెలంగాణ శకటం కనువిందు చేయబోతుంది. దీని వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ ఉందంటూ తెలుస్తోంది. ఈ ఏడాది తెలంగాణ శకటం ప్రదర్శన గురించి రేవంత్ రెడ్డి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ తో మాట్లాడి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది డిసెంబర్ 27న ప్రధాని మోదీ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయి.. తెలంగాణ శకటం గురించి చర్చించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే సందర్బంగా తెలంగాణ శకటం ప్రదర్శనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కానీ.. అప్పటికే శకటాల కోసం ఎంట్రీ పూర్తయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు అధికారులతో ప్రధాని మోదీ స్వయంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా దరఖాస్తు పంపించాలని.. తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. అదే సమయానికి మరో మూడు రాష్ట్రాల కూడా గడువు తర్వాత దరఖాస్తు చేసుకోగా.. తెలంగాణకు మాత్రమే అవకాశం కల్పించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురుస్తున్నాయి. 75వ గణతంత్ర దినోత్సవానికి ‘ప్రజా స్వామ్య మట్టి పరిమళాలు-జన సామాన్య ప్రజా స్వామ్య యోధులు’ అనే థీమ్ తో తెలంగాణ శకటం తయారవుతోంది.
‘జయ జయహే తెలంగాణ’ అని శకటానికి పేరు పెట్టారు. ప్రజాకవి అందెశ్రీ రాసిన ఈ పాట తెలంగాణ ఉద్యమ సమయంలో పల్లె, పట్నంలో మారు మోగింది. తెలంగాణ ప్రజల్లో మంచి జోష్ నింపింది. ఈ శకటం తెలంగాణ ఉద్యమ నేపథ్యం.. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమనే చరిత్రను శకటం ద్వారా ప్రదర్శించబోతున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన గోండు వీరుడు కొమురం భీం, బ్రిటీష్ సైన్యాన్ని ఎదురొడ్డి నిలిచిన రాంజీ గొండు, వీర వనిత చాకలి ఐటమ్మ విగ్రహాలను శకటంలో ప్రదర్శించనున్నారు. మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన త్యాగదనులను స్మరించేలా తెలంగాణ ప్రభుత్వ శకటం రూపుదిద్దుకుంటోంది. మరి దాదాపు మూడేళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో తెలంగాన శకటం పాల్గొనబోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.