ఫలించిన ఆదివాసీల పోరాటం.. 75 ఏళ్ల తర్వాత హైకోర్టు సంచలన తీర్పు!

  • Author singhj Published - 05:09 PM, Wed - 5 July 23
  • Author singhj Published - 05:09 PM, Wed - 5 July 23
ఫలించిన ఆదివాసీల పోరాటం.. 75 ఏళ్ల తర్వాత హైకోర్టు సంచలన తీర్పు!

కోర్టుల్లో కొన్ని కేసులు త్వరగా పరిష్కారమైనప్పటికీ.. మరికొన్ని కేసులు మాత్రం ఏళ్లకు ఏళ్లు నానడాన్ని చూస్తూనే ఉన్నాం. కేసుల పరిష్కారానికి సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం గురించి వార్తల్లోనూ చూస్తూనే ఉంటాం. ఈ కేసు కూడా అలాంటిదే. ఐదు, పది కాదు ఏకంగా 75 ఏళ్ల నుంచి ఈ కేసు కోర్టులోనే నలుగుతోంది. ఈలోపు ఎంతో మంది జడ్జిలు మారారు. కానీ పరిష్కారం మాత్రం రాలేదు. అయితే తమకు న్యాయం జరగాలని చేస్తున్న పోరాటాన్ని ఆదివాసీలు మాత్రం ఆపలేదు. న్యాయం కోసం పట్టువదలని విక్రమార్కుల్లా ఏళ్లకు ఏళ్లు పోరాడుతూనే వచ్చారు. ఎట్టకేలకు ఈ కేసులో వారు సక్సెస్ అయ్యారు. అవును.. 75 ఏళ్ల పాటు ఆదివాసీలు నిర్వహించిన పోరాటానికి నేడు ఫలితం దక్కింది. 75 ఏళ్ల నుంచి నలుగుతున్న ఒక కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

పట్టువదలకుండా పోరాటం సాగించిన ఆదివాసీలకు ఈ కేసులో విజయం లభించింది. ములుగు జిల్లా, మంగపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని రాష్ట్ర హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. ఆయా గ్రామాలకు సంబంధించిన ఈ కేసులో చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేడు తీర్పును వెలువరించారు. ఆదివాసీల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఆ 23 గ్రామాలు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ కిందకు రావని ఆదివాసీయేతర రాజకీయ నేతలు కోర్టును ఆశ్రయించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఎట్టకేలకు ఆదివాసీలకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ఇకపోతే, భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 అనేది షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించినది అనే విషయం తెలిసిందే.

Show comments