iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: టీఎస్​ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళిసై!

  • Author singhj Published - 03:10 PM, Sun - 6 August 23
  • Author singhj Published - 03:10 PM, Sun - 6 August 23
బ్రేకింగ్: టీఎస్​ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళిసై!

టీఎస్​ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల శుభవార్త అందించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై గవర్నర్ తమిళిసై రాష్ట్ర సర్కారును వివరణ కోరారు. దీంతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని తమిళిసై అడ్డుకుంటున్నారంటూ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఆగస్టు 5న రెండు గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేపట్టారు. కార్మికులు అందరూ ధర్నాకు దిగడంతో బస్సులు రోడ్డెక్కలేదు.

ప్రభుత్వంలో టీఎస్​ఆర్టీసీ విలీనం మీద నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు తొలగిపోయింది. ఆర్టీసీ ఎంప్లాయీస్ విలీనానికి సంబంధించిన బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఆదివారం ఉన్నతాధికారులతో చర్చల తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టే విషయంపై సర్కారు కాసేపట్లో క్లారిటీ ఇవ్వనుంది. ఆర్టీసీ విలీనం బిల్లు మీద తమిళిసై వివరణలు కోరగా.. గవర్నమెంట్ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ మధ్యాహ్నం అధికారులతో సమావేశమైన గవర్నర్.. చర్చల అనంతరం ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో నేడే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఇకపోతే, బిల్లుకు ఆమోదం తెలిపిన తమిళిసై మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు తాను వ్యతిరేకం కాదన్నారు. వాళ్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు. కాగా, ఆర్టీసీ బిల్లుపై తమిళిసైకి ప్రభుత్వం రెండుసార్లు వివరణ ఇచ్చినా ఆమె సంతృప్తి చెందలేదు. దీంతో ఇవాళ మధ్యాహ్నం రవాణా శాఖ కార్యదర్శితో పాటు ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు గవర్నర్​తో మరోమారు సమావేశం అయ్యారు. బిల్లుకు సంబంధించి ఆమెకు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె బిల్లుకు ఆమోదం తెలపడంతో రవాణా శాఖ అధికారులు అసెంబ్లీకి చేరుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి