Arjun Suravaram
Arjun Suravaram
తెలంగాణలో ఎన్నిక వేడి ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం ఉండటంతో అధికార పార్టీ బీఆర్ఎస్ తో సహా అన్ని పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఎన్నికల రణరంగలోకి కాస్తా ముందే దిగారు. ఈ క్రమంలోనే సోమవారం 115 మంది అభ్యర్థులతో కూడి జాబితాను విడుదల చేశారు. ఈ క్రమంలో కేవలం ఎనిమిది మంది సిట్టింగ్ లు మాత్రమే టికెట్ దక్కలేదు. వారిలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ కి చెందిన ఎమ్మెల్యే టి.రాజయ్య ఉన్నారు. ఆయనకు ఈ సారి బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో మాజీ మంత్రి కడియం శ్రీహరికి టికెట్ కేటాయించారు. అయితే తనకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించడంపై రాజయ్య కన్నీరు పెట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లో రాజయ్య ఇదే నియోజకవర్గం నుండి విజయం సాధించారు. 2014లో 60వేల ఓట్ల మెజారిటీ సాధించిన ఆయన, 2018లో 30వేలకి పైగా మెజారిటీ సాధించారు. ఇక మొదటి నుండి పార్టీకి కూడా నమ్మకస్తుడుగా ఉంటూ వచ్చారు. అయితే.. గత 6 నెలల్లో ఆయన పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఒకవైపు సర్పంచ్ నవ్య లైంగిక ఆరోపణలు, మరోవైపు కడియం శ్రీహరితో వైరం రాజయ్యకి శాపంగా మారాయి. ముఖ్యంగా నవ్య విషయంలో పార్టీ కూడా రాజయ్యని దూరం పెట్టింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ పొలిటీషియన్ అయిన కడియం శ్రీహరిని తెరపైకి తీసుకొచ్చింది. నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తి కారణంగా రాజయ్యకి టికెట్ ఇచ్చినా ఉపయోగం ఉండదని తేలడంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందట.
ఇక తనకి టికెట్ దక్కకపోవడంతో రాజయ్య.. అంబేద్కర్ విగ్రహం ముందు పడుకుని, బోరున విలపించారు. దళితుడైన తనపై అందరూ కలిసి కుట్ర చేసి, టికెట్ రాకుండా చేశారంటూ వాపోయారు. నిజానికి రాజయ్యకి కడియం శ్రీహరికి మధ్య పోరు ఈనాటిది కాదు. సమైక్య రాష్ట్రంలో రాజయ్యపై కడియం పై చేయి సాధిస్తూ వచ్చారు. ఇక తెలంగాణ ఏర్పడ్డాక తాటికొండ రాజయ్య హావా మొదలైంది. మొదటి దఫాలోనే ఆయనకి డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఇక 2018లో కూడా కడియంని కాదని రాజయ్యకే టికెట్ కేటయించారు. ఇంతటి ప్రాధాన్యత ఇచ్చినా రాజయ్య తీరు మారకపోవడంతోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. మరి.. రాజయ్య కి టికెట్ దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రెండు స్థానాల నుంచి సీఎం కేసీఆర్ పోటీ.. కారణం