Revanth Reddy: నిరుద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ భారీ శుభవార్త.. 90 రోజుల్లో 30 వేల జాబులు

Revanth Reddy-Unemployees,30000 Jobs In 90 Days: నిరుద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ పండగలాంటి వార్త చెప్పింది. రానున్న 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..

Revanth Reddy-Unemployees,30000 Jobs In 90 Days: నిరుద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ పండగలాంటి వార్త చెప్పింది. రానున్న 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంలో నిరుద్యోగులది కీలక పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పోటీ పరీక్షల నిర్వహణ, నోటిఫికేషన్ల జారీ అంశంలో గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న లోపాల వల్ల నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. అలాంటి సమయంలో కాంగ్రెస్‌ పార్టీ వారికి అనేక హామీలు ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి దాని ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రూప్స్‌ పోస్టుల పెంపు, గ్రూప్‌ 1 ప్రిలిమినరీలో 1:100 ఇవ్వాలని, డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. వీటిల్లో కొన్నింటికి ప్రభుత్వం అంగీకరించింది. ఇక తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. 90 రోజుల్లోనే మరో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆ వివరాలు..

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. మరో 3 నెలల్లో అనగా 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో శుక్రవారం నాడు నిర్వహించిన ఫైర్‌మెన్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫైర్‌మెన్‌ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసకున్న అభ్యర్థులను చూసి వారి తల్లిదండ్రులు సంతోషిస్తున్నారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం నిరుద్యోగులని మోసం చేసిందని.. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.. దీనిలో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేశామని తెలిపారు.

అంతేకాక తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని.. అందుకే విద్య, వైద్యానికి బడ్జెట్‌లో అధిక కేటాయింపులు చేశామని.. ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి తారీఖునే జీతం ఇస్తున్నామని రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాక రానున్న 90 రోజుల్లో సుమారు 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే.. 60 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించి.. నిరుద్యోగుల్లో విశ్వాసం నింపుతామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ భర్తీ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగులకు సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సూచన చేశారు. నిరుద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించండి అన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు మీ రేవంతన్నగా వారికి ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రేవంత్‌ ప్రకటనపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 30 వేల ఉద్యోగాలు దేనికి సంబంధించినవి అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Show comments