తెలంగాణలో గ్రూప్-1పై అభ్యర్థుల నిరసనలు.. కారణాలు ఏంటీ? పూర్తి వివరాలు..

Telangana Group-1 Mains: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించొద్దంటూ వాయిదా వేయాలని కోరుతూ ఆశావాహులు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్థుల నిరసనలకు గల కారణం ఏంటీ ఆ వివరాలు మీకోసం..

Telangana Group-1 Mains: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించొద్దంటూ వాయిదా వేయాలని కోరుతూ ఆశావాహులు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్థుల నిరసనలకు గల కారణం ఏంటీ ఆ వివరాలు మీకోసం..

తెలంగాణలో ఏళ్లతరబడి నిరుద్యోగులు గ్రూప్ -1 రిక్రూట్ మెంట్ కోసం చూస్తున్నారు. కానీ, గ్రూప్ 1 నియామకాలు ముందుకు సాగడం లేదు. ఏదో ఒక సమస్య గ్రూప్ 1 ను వెంటాడుతోంది. గత బీఆర్ ఎస్ ప్రభుత్వంలోనే గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ నిలిచిపోయింది. పేపర్ లీకేజీలు, బయోమెట్రిక్ సమస్యల కారణంగా గ్రూప్ 1 పరీక్షలు రద్దయ్యాయి. దీంతో లక్షలాది మంది గ్రూప్ 1అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. ఎన్నో కష్టాలకు ఓర్చి రేయింభవళ్లు ప్రిపేర్ అవుతున్నప్పటికీ గ్రూప్ 1 నియామకాలు జరగకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఉద్యోగాలు చూసుకోలేక.. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశ చంపుకోలేక నిరుద్యోగులు మానసిక వేధనకు గురవుతున్నారు.

ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు రెండు సార్లు రద్దయ్యాయి. ముచ్చటగా మూడోసారి ప్రిలిమ్స్ పరీక్షలు జరుగగా ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై నిరుద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా గ్రూప్ 1 పరీక్షలపై నిరుద్యోగులు రచ్చ చేస్తున్నారు. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో గ్రూప్ 1 ఆశావాహులు పలు డిమాండ్లు లేవనెత్తుతు రోడ్లపై బైఠాయిస్తున్నారు. జీవో 29 రద్దు చేయాలని.. అప్పటి వరకు మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల నిరసనలు, పోలీసుల లాఠీ ఛార్జ్ తో గ్రూప్ 1 వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అసలు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను విద్యార్థులు ఎందుకు అడ్డుకుంటున్నారు? వారికి జరుగుతున్న అన్యాయం ఏంటీ? ప్రభుత్వ స్పందన ఏవిధంగా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం.

మొదటిసారి గ్రూప్ 1 పరీక్ష రద్దు:

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. 2022 ఏప్రిల్‌లో 503 గ్రూప్‌-1 పోస్ట్‌ల భర్తీ కోసం టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ సమయంలో 3,50,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు 2,80,000 మంది హాజరయ్యారు. కాగా ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైనప్పటికీ.. పేపర్ లీకేజ్ కారణంగా మొదటిసారి గ్రూప్‌-1 పరీక్ష రద్దయ్యింది.

రెండవసారి గ్రూప్ 1 పరీక్ష రద్దు:

2023 జూన్‌లో మరోసారి గ్రూప్‌-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. అయితే బయోమెట్రిక్‌ అంశంలో వివాదం కారణంగా.. పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో.. పరీక్షల నిర్వహణలోని లోపాల నేపథ్యంలో గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో గ్రూప్ 1 మరోసారి రద్దైంది.

రీ నోటిఫికేషన్:

రెండు సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దవడంతో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేసింది. టీజీపీఎస్సీ ప్రక్షాళణ అనంతరం రీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. గ్రూప్ 1 కింద 563 పోస్టులకు టీజీపీఎస్సీ తిరిగి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పూర్తవగా ఇప్పుడు మెయిన్స్ పరీక్షల కోసం ఆశావాహులు సన్నద్ధమవుతున్నారు. అక్టోబ‌ర్ 21వ తేదీ నుంచి 27 వ‌ర‌కు మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీజీపీఎస్సీ ఇప్పటికే వెల్లడించింది. అయితే పరీక్షలు సమీపిస్తున్న వేళ గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ వేలాది మంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనకు కారణం:

గ్రూప్ 1 ఆశావాహుల ఆందోళనకు కారణం జీవో 29. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్​ 29ను రద్దు చేయాలని కోరుతూ నిరసనల బాట పట్టారు. ఈ జీవో వల్ల తాము నష్టపోతున్నామని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

సుప్రీం కోర్టుకు అభ్యర్థులు:

జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 29 వల్ల కలిగే నష్టాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే జీవో 29 రద్దు పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. తీర్పు వచ్చేంత వరకు గ్రూప్ 1పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టుతో మొట్టికాయలు కొట్టించుకోక ముందే ప్రభుత్వం దిగివచ్చి జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా గురించి మాట్లాడుతున్న సీఎం.. జీవో 29 వల్ల నష్టపోయే విద్యార్థుల గురించి ఎందుకు స్పందించడం లేదని గ్రూప్ 1 అభ్యర్థులు నిలదీస్తున్నారు.

అసలు ఏంటీ ఈ జీవో 29:

దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 55 జారీ చేసింది. అయితే ప్రస్తుతం రేవంత్ సర్కార్ జీవో 55కు సవరణ తీసుకువస్తూ ఫిబ్రవరి 8న జీవో 29ను తీసుకు వచ్చింది. జనరల్‌ కేటగిరీలోని అభ్యర్థుల​ కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్‌ రిజర్వుడుగానే పరిగణించాలని ఈ జీవోలో పేర్కొన్నారు. ఈ కారణంగా దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని.. వారికంటే ఎక్కువ మార్కులు వచ్చినా రిజర్వేషన్‌ కేటగిరీగానే పరిగణించి 1:50 కింద అభ్యర్థులను మెయిన్స్‌కు పిలవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ స్పందన:

జీవో 55 నే అమలు చేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. జీవో 29 ప్రకారమే నియామకాలు చేపడతామని ప్రభుత్వం వాదన వినిపిస్తోంది. దీంతో అభ్యర్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు. జీవో 55నే అమలు చేయాలని కోరినా.. సీఎం పెడచెవిన పెట్టారని గ్రూప్ 1 అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అభ్యర్థులపై పోలీసుల దాడులు:

కోర్టు తీర్పు వచ్చే వరకు గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేయాల్సిందేనని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు వచ్చి జీవో 55ను అమలు చేస్తామని అన్నాడు.. ఆ మాట ఎటు పోయింది? ప్రిలిమ్స్ లో తప్పుడు జవాబులు ఇచ్చి వికీపీడియా ప్రామాణికం అని అన్నారు.. అంటే మేము వికీపీడియాలు చదవాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. 3 రోజుల్లో పరీక్షలు పెట్టుకొని మేము రోడ్డు ఎక్కడానికి మాకేం సరదా కాదు.. మాకు న్యాయం జరిగాక పరీక్షలు నిర్వహించండి అంటూ గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళనలను ఉదృతం చేశారు. ఆందోళ‌న‌కు దిగిన అభ్య‌ర్థుల‌పై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పోలీసుల దాడుల్లో ప‌లువురు అభ్య‌ర్థులకు తీవ్ర గాయాల‌య్యాయి. అభ్యర్థులను అరెస్ట్ చేస్తూ పలు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో అశోక్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వ‌ర‌కు అడుగ‌డుగునా పోలీసులు మోహ‌రించారు.

అభ్యర్థులకు హైకోర్టు షాక్:

గ్రూప్ 1 మెయిన్స్ రాసే అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరీక్షలు వాయిదా వేయాలన్న గ్రూప్ – 1 అభ్యర్థుల రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Show comments