iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ కు రాహుల్ గాంధీ మకాం? ఇక్కడి నుంచే ఫ్యూచర్ ప్లాన్!

  • Author Soma Sekhar Published - 01:51 PM, Tue - 5 September 23
  • Author Soma Sekhar Published - 01:51 PM, Tue - 5 September 23
హైదరాబాద్ కు రాహుల్ గాంధీ మకాం? ఇక్కడి నుంచే ఫ్యూచర్ ప్లాన్!

రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పార్టీ అగ్రనేతలను కలుసుకోవడానికి తరచుగా ఢిల్లీకి వెళ్లి రావాల్సి వస్తోంది. ఇది పార్టీ నేతలకు, కార్యకర్తలకు కాస్త ఇబ్బందికరమైన వ్యవహారమే. అదీకాక ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు ఓ మైనస్ గా ఎత్తి చూపుతున్నాయి. మీ నేతలు ఢిల్లీలో ఉంటారు.. మేం గల్లీలో మీ వెంటే ఉంటాం అంటూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ లో నివాసం ఏర్పాటు చేసుకునేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. సౌత్ ఇండియాలో పార్టీని బలోపేతం చేసేందుకు హైదరాబాద్ లోనే కాంగ్రెస్ అగ్రనేత ఉండాలని భావిస్తున్నాట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఢిల్లీ నుంచే పార్టీ వ్యవహారాను నడిపిస్తూ ఉంటారు. దీంతో రాష్ట్రంలోని నాయకులు పార్టీ వ్యవహరాలను చక్కదిద్దేందుకు ఢిల్లీకి పయనం కావాల్సిన పరిస్థితి. ఇక నుంచి ఈ పరిస్థితి ఉండబోదని తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ లో నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాహుల్ భాగ్యనగరానికి షిప్ట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదీకాక సౌత్ ఇండియాకు హైదరాబాద్ కేంద్ర బిదువు కావడంతో.. ఇక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలను నడిపించాలని భావిస్తున్నారట. హైదరాబాద్ నుంచే రాహుల్ జాతీయ రాజకీయాలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి చెందిన కొంత మంది ముఖ్య నాయకులతో ఈ విషయం చర్చించినట్లుగా తెలుస్తోంది.

కాగా.. రాహుల్ తో పాటుగా తల్లి సోనియా గాంధీ కూడా కొంత కాలం ఇక్కడే ఉండేందుకు సౌకర్యవంతమైన ఇంటిని అన్వేషించే పనిలో ఉన్నారంట కొంత మంది కాంగ్రెస్ నాయకులు. అయితే ఖాళీ స్థలం కొని కొత్త భవనం నిర్మించుకోవాలా? లేదా అన్ని సౌకర్యాలు ఉన్న భవనాన్నే తీసుకోవాలనే అంశంపై ఆలోచిస్తున్నారట నాయకులు. కాగా.. ఈనెల 16న నగరంలో కొత్తగా కొలువుదీరిన సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సోనియాతో పాటుగా రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ హైదరాబాద్ కు మకాం మార్చే విషయమై మరింత సమాచారం రానుంది. మరి రాహుల్ గాంధీ హైదరాబాద్ కి మకాం మారుస్తున్నారు అన్న వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.