iDreamPost
android-app
ios-app

RRRపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఆ ప్రాంతాల్లోని భూములకు ఫుల్ డిమాండ్!

  • Published Feb 13, 2024 | 10:41 AM Updated Updated Feb 13, 2024 | 10:41 AM

రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణంపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీని నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లోని భూములకు కనకవర్షం కురువనున్నది. ఆ ప్రాంతాల్లో పెట్టుబడిపెడితే అధిక లాభాలను పొందే వీలుండనున్నది.

రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణంపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీని నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లోని భూములకు కనకవర్షం కురువనున్నది. ఆ ప్రాంతాల్లో పెట్టుబడిపెడితే అధిక లాభాలను పొందే వీలుండనున్నది.

RRRపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఆ ప్రాంతాల్లోని భూములకు ఫుల్ డిమాండ్!

హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అవతరిస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు నగరంలో పెట్టుబడులు పెట్టెందుకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు హైదరాబాద్ లో తమ సంస్థలను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రాభివృద్ధిపై దృష్టిసారించింది. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్డుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి ప్రకటనతో ఆయా ప్రాంతాల్లోని భూములకు సిరులు కురవనున్నాయి.

హైదారాబద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ మణిహారంగా మారిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వెలపలి శివారు ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన ఓఆర్ఆర్ అన్ని వర్గాల వారికి లాభదాయకంగా మారింది. ముఖ్యంగా ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడం, జాతీయ, రాష్ట్ర రోడ్ల కనెక్టివిటీకి ఓఆర్ఆర్ కీలకంగా మారింది. అంతేకాదు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంతో రియల్ ఎస్టేట్ సెక్టార్ లో గణనీయమైన అభివృద్ధి జరిగింది. మరోవైపు నగరంలో మెట్రో ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో భూములకు రెక్కలొచ్చాయి. ఇటీవల కోకాపేటలో ఎకరం 100 కోట్లకు పైగా పలికి కనక వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణంతో రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకోనుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ నిర్మాణంపై మంత్రి కోమటి రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపడతామని మంత్రి కోమటి రెడ్డి స్పష్టం చేశారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో తెలంగాణ సగం ముఖచిత్రమే మారిపోతుందన్నారు. ఇటీవలె దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశానని తెలిపారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనులకు మరో రెండు, మూడు నెలల్లోనే టెండర్లు ఆహ్వానిస్తామని మంత్రి వెల్లడించారు. ఇటీవల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖకు రూ. 25 వేల కోట్లు కేటాయించిందన్నారు. 338 కి.మీల ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి కోమటి రెడ్డి తెలిపారు.

సంగారెడ్డి నుంచి నర్సాపూర్- తూప్రాన్- గజ్వేల్- జగదేవ్‌పూర్- భువనగిరి- చౌటుప్పల్ వరకు, అలాగే చౌటుప్పల్ నుంచి యాచారం- కడ్తాల్- షాద్‌నగర్- చేవెళ్ల- శంకర్‌పల్లి- కంది (సంగారెడ్డి) వరకు ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరుగనున్నది. ఇందుకోసం 70 శాతం వరకు భూసేకరణ కూడా పూర్తికాగా.. మిగతా భూమి కోసం భూసేకరణ చేస్తున్నారు అధికారులు. ఇక రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు మొగ్గుచూపుతాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతాయనడంలో సందేహం లేదు. దీనికి తోడు మెట్రో విస్తరణ ఎయిర్ పోర్టు వరకు చేపట్టనున్నట్లు రేవంత్ సర్కార్ ప్రకటించడంతో భూముల ధరలకు రెక్కలు రావడం ఖాయమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.